సోమవారం 21 సెప్టెంబర్ 2020
National - Aug 06, 2020 , 15:59:47

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనంపై పిటిషన్‌ తిరస్కరణ

రాజస్థాన్‌ కాంగ్రెస్‌లో బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనంపై పిటిషన్‌ తిరస్కరణ

జైపూర్‌: రాజస్థాన్‌ కాంగ్రెస్‌ పార్టీలోకి ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేల విలీనాన్ని వ్యతిరేకిస్తూ దాఖలైన పిటిషన్‌ను ఆ రాష్ట్ర హైకోర్టు గురువారం తిరస్కరించింది. బీఎస్పీ ఎమ్మెల్యేలను కాంగ్రెస్‌లో పార్టీలో కలుపుకోవడంపై బీఎస్పీతోపాటు బీజేపీ నేత మదన్‌ దిలావార్‌ వేర్వేరుగా పిటిషన్లు దాఖలు చేశారు. కాగా మదన్‌ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ జరిపిన రాజస్థాన్‌ హైకోర్టు కొన్ని షరతులతో దానిని కొట్టివేసింది. బీఎస్పీ పిటిషన్‌పై విచారణ జరుపుతున్న సింగిల్‌ బెంచ్‌ దీనిపై నిర్ణయం తీసుకుంటుందని పేర్కొంది. ఈ విషయంలో స్పీకర్‌ జోషికి హైకోర్టు బుధవారం ఒక నోటీసు జారీ చేసింది. జైసల్మేర్ జిల్లా న్యాయమూర్తి ద్వారా వార్తాపత్రికల్లో ప్రచురించాలని ఆదేశించింది. ఈ అంశంలో అవసరమైతే ఎస్పీ సహాయం కోరవచ్చని హైకోర్టు చెప్పినట్లు స్పీకర్‌ సీసీ జోషి తరుఫు న్యాయవాది ప్రతీక్‌ కల్శివాల్ తెలిపారు. 

కాగా హైకోర్టు తీర్పు సీఎం అశోక్‌ గెహ్లాట్‌కు ఊరటనిచ్చినట్లయ్యింది. గెహ్లాట్‌కు ఎదురుతిరిగిన సచిన్‌ పైలట్‌కు 18 మంది కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు మద్దతిస్తున్నారు. వారిపై కాంగ్రెస్‌ అనర్హత వేటు వేయగా ఈ అంశం కూడా కోర్టులో ఉన్నది. మరోవైపు ఆరుగురు కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల విలీనాన్ని కోర్టు రద్దు చేసి ఉంటే సీఎం అశోక్‌ గెహ్లాట్‌ ప్రభుత్వం కష్టాల్లో పడేది. తనకు మద్దతిస్తున్న సుమారు 102 మంది ఎమ్మెల్యేలను జైసల్మేర్‌లోని హోటల్‌లో ఆయన ఉంచారు. ఈ నెల 14 నుంచి అసెంబ్లీ నిర్వహణకు గవర్నర్‌ అంగీకారం తెలుపడంతో సభలో తన బలాన్ని నిరూపించుకుంటానని సీఎం అశోక్‌ గెహ్లాట్‌ చెబుతున్నారు. తమ ప్రభుత్వాన్ని కూల్చేందుకు బీజేపీ చేస్తున్న ప్రయత్నాలేమీ ఫలించబోవని ఆయన పేర్కొన్నారు. 


logo