గురువారం 03 డిసెంబర్ 2020
National - Nov 22, 2020 , 08:52:47

రాజస్థాన్‌లో రాత్రిపూట కర్ఫ్యూ

రాజస్థాన్‌లో రాత్రిపూట కర్ఫ్యూ

జైపూర్‌ : కొవిడ్‌ మహమ్మారి నేపథ్యంలో రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రాత్రిపూట కర్ఫ్యూ విధించాలని రాజస్థాన్‌ సర్కారు నిర్ణయించింది. కేసులు పెరుగుతున్న దృష్ట్యా ఎనిమిది ప్రధాన నగరాలైన జైపూర్‌, జోద్‌పూర్‌, కోటా, బికనీర్‌, ఉదయ్‌పూర్‌, అజ్మీర్‌, అల్వార్‌, బిల్వారాలో రాత్రి 8 నుంచి ఉదయం 6 గంటల వరకు ప్రభుత్వం కర్ఫ్యూ విధించింది. కేబినెట్‌ సమావేశం అనంతరం నిర్ణయం తీసుకున్నట్లు సీఎం అశోక్ గెహ్లాట్‌ తెలిపారు. ఈ సమయాల్లో వివాహ వేడుకలు వెళ్లే వారికి, అత్యవసరమైన సేవలు, బస్సులు, రైలు, విమాన ప్రయాణికులకు అనుమతి ఇవ్వనున్నట్లు సీఎం పేర్కొన్నారు. ఈ మేరకు సీఎం కార్యాలయం అధికారికంగా ఉత్తర్వులు జారీ చేసింది.

ఈ నెలలో రోజువారీకేసుల సంఖ్య 1700 నుంచి 3వేలకు పెరిగింది. ఈ ఎనిమిది జిల్లాల పరిధిలో కేసులు ఎక్కువగా ఉంటోంది. శీతాకాలం నేపథ్యంలో పరిస్థితి తీవ్రంగా మారుతోందని, ఈ మేరకు ప్రజల ప్రాణాలన రక్షించేందుకు ప్రభుత్వం కఠిన నిర్ణయాలు తీసుకుంటుందని చెప్పింది. అలాగే మాస్క్‌ ధరించనందుకు రూ.200 జరిమానా విధిస్తుండగా.. రూ.500కు పెంచారు. బహిరంగ ప్రదేశాల్లో తప్పనిసరిగా మాస్క్‌ పెట్టుకోవాలని ప్రభుత్వం ఆదేశించింది. ఇదిలా ఉండగా శనివారం రాజస్థాన్‌లో 3007 పాజిటివ్‌ కేసులు నిర్ధారణ అయ్యాయి. దీంతో మొత్తం పాజిటివ్‌ కేసుల సంఖ్య 2,40,676కు చేరింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.