సోమవారం 10 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 01:26:15

సభకు ఓకే.. షరతులతో..

సభకు ఓకే.. షరతులతో..

  • 21 రోజుల షార్ట్‌ నోటీసుకు సరేనా? 
  • రాజస్థాన్‌ ప్రభుత్వానికి గవర్నర్‌ ప్రశ్నలు 

జైపూర్‌, జూలై 27: రాజస్థాన్‌ అసెంబ్లీని సమావేశపర్చేందుకు రాష్ట్ర గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా ఎట్టకేలకు అంగీకరించారు. అయితే, ప్రభుత్వానికి ఆయన మూడు ప్రశ్నలు సంధించారు. సభ ఎజెండాలో ప్రభుత్వ బల నిరూపణ అంశం ఉంటుందా? ఎమ్మెల్యేలకు 21రోజుల షార్ట్‌ నోటీస్‌ ఇవ్వగలరా? కరోనా విస్తరిస్తున్న వేళ సభలో భౌతిక దూరం ఎలా పాటిస్తారు? అని ప్రశ్నించారు. బల నిరూపణే ఎజెండా అయితే సభను సమావేశపర్చటానికి తనకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వానికి రాసిన లేఖలో పేర్కొన్నారు. బలనిరూపణ జరిగే పక్షంలో సభా కార్యక్రమాలను ప్రత్యక్ష ప్రసారం చేస్తారా అని అడిగారు.

మీరు జోక్యం చేసుకోండి 

అసెంబ్లీని సమావేశపర్చేందుకు జోక్యం చేసుకోవాలని రాష్ట్రపతి కోవింద్‌ను రాజస్థాన్‌ కాంగ్రెస్‌ శాసనసభా పక్షం (సీఎల్పీ) సోమవారం కోరింది. ఈ మేరకు వినతి పత్రాన్ని పంపింది. ప్రధాని మోదీతో కూడా ఫోన్లో మాట్లాడి తాజా రాజకీయ పరిస్థితిని వివరించినట్టు ఎమ్మెల్యేలతో సోమవారం సమావేశం సందర్భంగా సీఎం అశోక్‌గెహ్లాట్‌ తెలిపారు. మరోవైపు తిరుగుబాటు ఎమ్మెల్యేలకు వ్యతిరేకంగా అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషి సుప్రీంకోర్టులో దాఖలు చేసిన పిటిషన్‌ను ఉపసంహరించుకున్నారు.

మరో 15మంది బయటకొస్తారు

గెహ్లాట్‌ వర్గంలోని మరో 10-15 మంది ఎమ్మెల్యేలు తమవైపు చేరేందుకు సిద్ధంగా ఉన్నారని తిరుగుబాటు ఎమ్మెల్యే హెమరామ్‌ చౌదరి బాంబు పేల్చారు.


logo