ఆదివారం 09 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 20:33:04

సచిన్ పైలట్ టీమ్ బస చేసిన హోటల్ వద్ద హైడ్రామా

సచిన్ పైలట్ టీమ్ బస చేసిన హోటల్ వద్ద హైడ్రామా

న్యూఢిల్లీ: రాజస్థాన్ సీఎం అశోక్ గెహ్లాట్‌కు వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన  కాంగ్రెస్ పార్టీ నేత సచిన్ పైలట్, ఆయనకు మద్దతిస్తున్న ఎమ్మెల్యేలు బస చేసిన హోటల్ వద్ద శుక్రవారం హైడ్రామా నెలకొన్నది. రాజస్థాన్‌లో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చేందుకు  ఎమ్మెల్యే భన్వర్‌లాల్ శర్మ బీజేపీతో బేరాలు సాగించినట్లుగా ఆరోపిస్తున్న ఒక ఆడియో వెలుగులోకి వచ్చింది. అయితే అది తప్పుడు ఆడియో టేప్ అని ఆయన తెలిపారు.

కాగా, ఈ ఆడియో టేప్‌నకు సంబంధించి రాజస్థాన్ స్పెషల్ ఆపరేషన్ గ్రూప్ పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో సచిన్ పైలట్ టీంలోని ఎమ్మెల్యే భన్వర్ లాల్ శర్మ కోసం పోలీసుల ప్రత్యేక టీం హర్యానాలోని మానేసర్ హోటల్‌కు చేరుకున్నది. అయితే అక్కడ భారీగా మోహరించిన హర్యానా రాష్ట్ర పోలీసులు రాజస్థాన్ పోలీసులను అడ్డుకున్నారు. దీంతో కొద్దిసేపు అక్కడ హైడ్రామా నడిచింది. చివరకు రాజస్థాన్ ఎస్‌వోజీ పోలీసులను ఆ హోటల్‌లోనికి అనుమతించారు. ఆడియో టేప్‌లో సంభాషిస్తున్నట్లు ఆరోపణలున్న ఎమ్మెల్యేల వాయిస్ నమూనాలను రాజస్థాన్ పోలీసులు సేకరిస్తారని సమాచారం.

మరోవైపు హర్యానాలోని బీజేపీ ప్రభుత్వం సచిన్ పైలట్ టీమ్‌ను కాపాడేందుకు ప్రయత్నిస్తున్నదని రాజస్థాన్ సీఎం అశ్లోక్ గెహ్లాట్ ఆరోపించారు. బీజేపీలో చేరబోనంటున్న సచిన్ పైలట్ ఆ పార్టీ అధికారంలో ఉన్న హర్యానాలోని హోటల్‌లో ఎందుకు ఉంటున్నారని ఆయన ప్రశ్నించారు.
logo