శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 31, 2020 , 02:26:11

ఎమ్మెల్యేలకు భారీగా బేరం

ఎమ్మెల్యేలకు భారీగా బేరం

  • గతంలోనే 15 కోట్లు.. ఇప్పుడు ఎంతైనా ఇస్తామంటున్నారు 
  • బీజేపీపై రాజస్థాన్‌ సీఎం గెహ్లాట్‌ ఆరోపణలు 
  • అసెంబ్లీలో బలం నిరూపించుకుంటామని వెల్లడి

జైపూర్‌, జూలై 30: రాజస్థాన్‌లో ఆగస్టు 14 నుంచి అసెంబ్లీ సమావేశాలకు గవర్నర్‌ ఆమోదించిన నేపథ్యంలో.. కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలను కొనేందుకు బీజేపీ భారీ ఎత్తున డబ్బులు ఎరవేస్తున్నదని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి అశోక్‌ గెహ్లాట్‌ ఆరోపించారు. గతంలో రూ.10-15 కోట్లు ఇవ్వజూపారని, ఇప్పడు ఎంత కావాలో తీసుకోండి అనేలా ఉన్నారని పరోక్షంగా బీజేపీపై విమర్శలు గుప్పించారు. ‘విశ్వాస పరీక్ష ఉంటది. మేం అసెంబ్లీకి వెళ్తున్నాం. ఎజెండాను బీఏసీ నిర్ణయిస్తుంది. గతంలో ఎమ్మెల్యేలను కొనేందుకు మొదటి విడత రూ.10కోట్లు, రెండో విడత రూ.15 కోట్లు ఇచ్చారు. ఇప్పుడు ఎంతకావాలో చెప్పండి అని అడుగుతున్నారు. దీన్నిబట్టి రేటు పెంచారని అర్థమవుతున్నది. హార్స్‌ ట్రేడింగ్‌కు ఎవరు పాల్పడుతున్నారో అందరికీ తెలుసు’ అని గెహ్లాట్‌ గురువారం పేర్కొన్నారు. తిరుగుబాటు ఎమ్మెల్యేలు డబ్బుకు అమ్ముడుపోకుండా ఉంటే తిరిగి రావాలని డిమాండ్‌ చేశారు. బీజేపీ చెప్పినట్టుగా బీఎస్పీ అధ్యక్షురాలు మాయావతి మాట్లాడుతున్నారని విమర్శించారు.

స్పీకర్‌కు హైకోర్టు నోటీసులు

ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో విలీనం అయినట్టు అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషీ ఇచ్చిన రూలింగ్‌పై రాష్ట్ర హైకోర్టు నివేదిక కోరింది. ఈ చేరికలను వ్యతిరేకిస్తూ బీఎస్పీతోపాటు బీజేపీ ఎమ్మెల్యే మదన్‌ దిలావర్‌ దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన జస్టిస్‌ మహేంద్రకుమార్‌ గోయెల్‌ నేతృత్వంలోని ధర్మాసం ఏ ప్రాతిపదికన బీఎస్పీ ఎమ్మెల్యేలు కాంగ్రెస్‌లో కలిసిపోయారో చెప్పాలని ఆదేశించింది. స్పీకర్‌తోపాటు శాసనసభ కార్యదర్శి, ఆరుగురు బీఎస్పీ ఎమ్మెల్యేలకు వేర్వేరుగా గురువారం నోటీసులు జారీ చేసింది. తదుపరి విచారణను ఆగస్టు 11కు వాయిదావేసింది.


logo