బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 30, 2020 , 15:44:01

ఆగస్టు 14 వరకు హోటల్‌లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

ఆగస్టు 14 వరకు హోటల్‌లోనే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు

జైపూర్‌: రాజ‌స్థాన్ అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభమ‌య్యేంత వ‌ర‌కు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా హోట‌ల్‌లోనే ఉండ‌నున్నారు. జైపూర్‌లోని హోటల్ ఫెయిర్‌మాంట్‌లో సీఎం అశోక్ గెహ్లాట్ ఆధ్వ‌ర్యంలో గురువారం కాంగ్రెస్ లెజిస్లేచర్ పార్టీ (సిఎల్‌పి) సమావేశం జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా అసెంబ్లీ స‌మావేశాలు ప్రారంభ‌మ‌య్యే ఆగ‌స్టు 14 వ‌ర‌కు ఎమ్మెల్యేలంతా హోట‌ల్‌లోనే ఉండాల‌ని సీఎం గెహ్లాట్ చెప్పిన‌ట్లు పార్టీ వ‌ర్గాలు వెల్ల‌డించాయి. మంత్రులు త‌మ విధుల కోసం స‌చివాల‌యానికి వెళ్లి రావ‌చ్చ‌ని ఆయ‌న పేర్కొన్న‌ట్లు తెలిపాయి. 

కాంగ్రెస్ నేత స‌చిన్ పైల‌ట్ సీఎం గెహ్లాట్‌కు ఎదురు తిరిగిన సంగ‌తి తెలిసిందే. దీంతో ఆయ‌న‌తోపాటు మ‌ద్ద‌తుగా ఉన్న 18 ఎమ్మెల్యేల‌పై కాంగ్రెస్ పార్టీ అన‌ర్హ‌త వేటు వేయ‌గా ఈ అంశం కోర్టుకు చేరింది. వారికి జారీ చేసిన అనర్హత నోటీసులపై యథాతథస్థితిని కొనసాగించాల‌ని జూలై 24న ఆ రాష్ట్ర హైకోర్టు ఆదేశించింది. కాగా ఈ ఉత్తర్వులను సవాల్‌ చేస్తూ అసెంబ్లీ స్పీకర్‌ సీపీ జోషి బుధవారం సుప్రీంకోర్టును ఆశ్రయించారు. అధికార కాంగ్రెస్‌పార్టీలో తమ ఆరుగురు ఎమ్మెల్యేల విలీనాన్ని సవాల్‌ చేస్తూ బీఎస్పీ కూడా రాజస్థాన్‌ హైకోర్టును ఆశ్రయించింది. 

మ‌రోవైపు త‌మ ప్ర‌భుత్వ బ‌లాన్ని నిరూపించుకుంటామ‌ని, అసెంబ్లీని స‌మావేశ ప‌ర్చాలంటూ సీఎం గెహ్లాట్ ప‌లుమార్లు పంపిన ప్ర‌తిపాద‌న‌ను గ‌వ‌ర్న‌ర్ కల్‌రాజ్‌ మిశ్రా తిర‌స్క‌రించారు. అసెంబ్లీ సమావేశానికి ప్రభుత్వం సరైన కారణం చెప్పని పక్షంలో 21 రోజుల ముందుగా నోటీసు ఇవ్వాల‌ని చెప్పారు. ఈ మేర‌కు ప్ర‌భుత్వం పంపిన ప్ర‌తిపాద‌న‌కు గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా ఎట్టకేలకు బుధ‌వారం ఆమోదం తెలిపారు. దీంతో ఆగస్టు 14న అసెంబ్లీని సమావేశపరుచనున్నట్టు రాజ్‌భవన్‌ వర్గాలు వెల్ల‌డించాయి. ఈ నేప‌థ్యంలో కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు చేజారిపోకుండా అప్ప‌టి వ‌ర‌కు హోటల్ ఫెయిర్‌మాంట్‌లోనే వారిని ఉంచ‌నున్న‌ట్లు తెలుస్తున్న‌ది.



logo