శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 25, 2020 , 03:06:56

రాజ్‌భవన్‌లో రగడ

రాజ్‌భవన్‌లో రగడ

  • గవర్నర్‌తో రాజస్థాన్‌ సీఎం గెహ్లాట్‌ భేటీ
  • అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలకు పట్టు 
  • రాజ్‌భవన్‌లోనే కాంగ్రెస్‌ ఎమ్మెల్యేల ధర్నా
  • దిగొచ్చిన గవర్నర్‌.. అసెంబ్లీ సెషన్‌కు ఓకే
  • పైలట్‌ వర్గానికి హైకోర్టులో ఊరట

జైపూర్‌, జూలై 24: రాజస్థాన్‌లో రాజకీయ సంక్షోభం శుక్రవారం మొత్తం రాజ్‌భవన్‌ చుట్టూ తిరిగింది. న్యాయస్థానాల్లో వరుస ఎదురుదెబ్బలతో వ్యూహం మార్చిన సీఎం గెహ్లాట్‌ తక్షణం అసెంబ్లీలో బలనిరూపణకు గవర్నర్‌పై ఒత్తిడి పెంచారు. ప్రభుత్వ బలనిరూపణకు సోమవారం అసెంబ్లీ ప్రత్యేక సమావేశాలు నిర్వహించాలని గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాను సీఎం కోరటంతో ఆయన నిరాకరించారు. దాంతో సీఎం వర్గం ఎమ్మెల్యేలు అనూహ్యంగా రాజ్‌భవన్‌లోనే ధర్నాకు దిగారు. వెంటనే అసెంబ్లీని సమావేశపర్చాలని నినాదాలు చేశారు. ఐదుగంటల ధర్నా అనంతరం అసెంబ్లీని సమావేశపర్చేందుకు గవర్నర్‌ ఒప్పుకున్నారు. 

రాజ్‌భవన్‌ను ముట్టడిస్తే నాది బాధ్యత కాదు

అనూహ్య పరిణామాల మధ్య గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రాకు సీఎం గెహ్లాట్‌ తీవ్ర హెచ్చరిక జారీచేశారు. వెంటనే అసెంబ్లీని సమావేశపర్చకుంటే ప్రజలు రాజ్‌భవన్‌ను ముట్టడించే ప్రమాదం ఉందని, అదే జరిగితే బాధ్యత తనది కాదని హెచ్చరించారు. బలనిరూపణకు అవకాశం ఇచ్చిన తర్వాతే రాజ్‌భవన్‌ను వీడి వెళ్తామని సీఎం తెగేసి చెప్పారు. గవర్నర్‌ను కలిసి సోమవారం సభను సమావేశపర్చాలని కోరగా, కోర్టు కేసులు ఉన్నందున న్యాయ సలహా తీసుకున్న తర్వాతే నిర్ణయం తీసుకుంటానని గవర్నర్‌ స్పష్టంచేశారు. అయితే, సీఎంతోపాటు ఎమ్మెల్యేలంతా అక్కడే ధర్నాకు దిగటంతో గవర్నర్‌ కల్‌రాజ్‌ మిశ్రా చివరకు అసెంబ్లీ సమావేశాల నిర్వహణకు ఒప్పుకున్నారు. ఆ వెంటనే క్యాబినెట్‌ను సమావేశపర్చిన సీఎం, అసెంబ్లీ సమావేశాలను ప్రారంభించాలని గవర్నర్‌ను కోరుతూ తీర్మానం చేశారు. ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాన్ని కుట్రతో కూలదోయటానికి ప్రయత్నిస్తున్నారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌గాంధీ పరోక్షంగా బీజేపీపై మండిపడ్డారు.

గవర్నర్‌నే నిర్బంధిస్తారా?

సీఎం వైఖరిపై గవర్నర్‌ తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. గవర్నర్‌ను ప్రభుత్వమే రాజ్‌భవన్‌లో బంధిస్తే ఇక రక్షణ ఎవరు కల్పిస్తారని గెహ్లాట్‌కు రాసిన లేఖలో ప్రశ్నించారు. గవర్నర్‌కు సీఎం హెచ్చరికలపై ప్రతిపక్ష బీజేపీ మండిపడింది. రాజ్‌భవన్‌కు సీఆర్పీఎఫ్‌ బలగాలతో రక్షణ కల్పించాలని అసెంబ్లీలో ప్రతిపక్ష నాయకుడు గులాబ్‌చంద్‌ కటారియా కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. 

యధాతథ స్థితి కొనసాగించాలి: హైకోర్టు 

తిరుగుబాటునేత సచిన్‌పైలట్‌, మరో 18మంది ఎమ్మెల్యేలకు అసెంబ్లీ స్పీకర్‌ సీపీజోషీ జారీ చేసిన అనర్హత షోకాజ్‌ నోటీసులపై సోమవారం వరకు ఎలాంటి చర్యలు తీసుకోరాదని రాజస్థాన్‌ హైకోర్టు శుక్రవారం స్పీకర్‌కు సూచించింది. ఈ పిటిషన్ల విచారణలో కేంద్ర ప్రభుత్వాన్ని కూడా ఇంప్లీడ్‌ చేయాలన్న పైలట్‌ వినతికి కోర్టు సమ్మతించింది. కాగా, తాజా పరిణామాలపై సచిన్‌పైలట్‌ ఆచితూచి స్పందించారు. సీఎం గెహ్లాట్‌ తనపై చేసిన ఆరోపణలు తీవ్ర మనస్థాపం కలిగించాయని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు తర్వాతే తాను అన్ని అంశాలపై స్పందిస్తానని తెలిపారు. కాంగ్రెస్‌ పార్టీకి వ్యతిరేకంగా ఏమీ మాట్లాడబోనని స్పష్టంచేశారు.

గెహ్లాట్‌ ఏదో ఒక మ్యాజిక్‌ చేస్తాడు

సంక్షోభం నుంచి బయటపడేందుకు అశోక్‌గెహ్లాట్‌ ఏదో ఒక మ్యాజిక్‌ చేస్తారని ఆయన చిన్ననాటి స్నేహితుడు ఎస్‌కే నిగమ్‌ అన్నారు. అశోక్‌ గెహ్లాట్‌ తండ్రి లక్ష్మణ్‌సింగ్‌ గెహ్లాట్‌ గొప్ప మ్యాజీషియన్‌గా దేశవ్యాప్త గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రివద్ద అశోక్‌గెహ్లాట్‌ కూడా కొంతకాలం మ్యాజిక్‌ అభ్యసించారు. ఈ నేపథ్యంలో ప్రస్తుత సంక్షోభంపై స్పందించిన నిగమ్‌, గెహ్లాట్‌కు చాలా ట్రిక్కులు తెలుసని పేర్కొన్నారు. 

తాజావార్తలు


logo