గురువారం 26 నవంబర్ 2020
National - Jul 11, 2020 , 08:44:54

మిడతలదండు దాడిని జాతీయ విపత్తుగా ప్రకటించండి

మిడతలదండు దాడిని జాతీయ విపత్తుగా ప్రకటించండి

జైపూర్‌: ఉత్తర భారతదేశంపై దాడిచేస్తున్న మిడతల దండు భారీగా పంటపొలాను నాశనం చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో రైతుల ప్రయోజనాల దృష్ట్యా మిడతల దాడిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని రాజస్థాన్‌ సర్కార్‌ కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది. కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమార్‌తో వీడియో కాన్ఫరెన్స్‌ సందర్భంగా రాజస్థాన్‌ వ్యవసాయ మంత్రి లాల్‌చంద్‌ కటారియా ఈ మేరకు విజ్ఞప్తి చేశారు. మిడతల దాడిని జాతీయ విపత్తుగా ప్రకటించి, రైతులకు ఉపశమనం కల్పించాలని కోరుతూ రాష్ర్టానికి చెందిన ఎంపీ హనుమాన్‌ బెనివాల్‌ ఇప్పటికే ప్రధాని మోదీకి లేఖ రాశారు. 

2020-21 ఏడాదికి సంబంధించి కేంద్ర ప్రాయోజిక పథకాల్లో మొదటి విడత ఇంకా విడుదల కాలేదని, రైతుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకుని వాటిని వెంటనే విడుదల చేయాలని మంత్రి కోరారు. అదేవిధంగా 2019 ఖరీఫ్‌లో జరిగిన పంట నష్టానికి సంబంధించిన బీమా సొమ్ము రూ.380 కోట్లు వెంటనే విడుదల చేయాలన్నారు. 

పాకిస్థాన్‌ నుంచి వచ్చిన మిడతల దండు గుజరాత్‌, మహారాష్ట్ర, మధ్యప్రదేశ్‌, రాజస్థాన్‌, బీహార్‌, ఉత్తరప్రదేశ్‌, హర్యానా, పంజాబ్‌ రాష్ర్టాల్లో భారీఎత్తున పంటలకు నష్టం చేకూర్చిన విషయం తెలిసిందే.