గురువారం 26 నవంబర్ 2020
National - Nov 01, 2020 , 13:15:39

ల‌వ్ జిహాద్‌ను స‌హించం: యూపీ సీఎం

ల‌వ్ జిహాద్‌ను స‌హించం: యూపీ సీఎం

ల‌క్నో: ఉత్త‌ర‌ప్ర‌దేశ్‌లో మతాంతర వివాహాలను అడ్డుకునేందుకు యోగి సర్కార్‌ కసరత్తులు చేస్తున్న‌ది. ఈ మేరకు చట్టాలు చేయనున్నట్లు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్‌ తెలిపారు. లవ్‌జిహాద్‌ను అడ్డుకోవ‌డానికి ఈ చర్యలు చేపడుతున్నట్లు చెప్పారు. పెండ్లి కోసం మత మార్పిడి అవసరం లేదని అలహాబాద్‌ హైకోర్టు తీర్పునిచ్చిన నేప‌థ్యంలో యూపీ సీఎం తాజా చ‌ర్య‌ల‌కు పూనుకున్నారు. 

లవ్‌ జిహాద్‌ను అడ్డుకునేందుకు చట్టాలు తీసుకురావాలని విశ్వ హిందూ పరిషత్ కూడా గత కొంత కాలంగా డిమాండ్ చేస్తున్న‌ది. ఆ డిమాండ్‌కు త‌లొగ్గే యూపీ ప్ర‌భుత్వం చ‌ట్టాలు చేయాలన్న ఆలోచనకు వచ్చింద‌ని కొంద‌రు ఆరోపిస్తున్నారు. ఈ నేప‌థ్యంలో ఎవరైతే తమ అసలు వివరాల‌ను దాచి, హిందూ మహిళలను వలలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారో అలాంటి వారు తీరు మార్చుకోవాల‌ని, లేదంటే రామ్‌నామ్‌ సత్య ప్రయాణం (ఆఖరి ప్రయాణం) మొదలవుతుందని హెచ్చరికలు జారీ చేశారు. అంటే పరోక్షంగా యోగి చంపేస్తామని హెచ్చరించారు. 

ప్రియాంషి అలియాస్‌ సమ్రీన్‌ అనే యువతి వేరే మతానికి చెందిన తన భర్తతో కలిసి గత నెలలో అలహాబాద్‌ హైకోర్టును ఆశ్రయించారు. ఈ ఏడాది జులైలో తాము పెండ్లి చేసుకున్నామని, మతాల విషయంలో తమ కుటుంబాల నుంచి ఒత్తిడి నెలకొందని పిటిషన్‌లో పేర్కొన్నారు. అయితే మతం గురించి తెలియకుండా, నమ్మకం లేకుండా కేవలం పెళ్లి కోసం మార్చుకోవడం సరికాదని అభిప్రాయపడుతూ కోర్టు ఆ పిటిషన్‌ను కొట్టివేసింది.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.