శనివారం 16 జనవరి 2021
National - Jan 04, 2021 , 01:54:49

హోరు వానలో జోరు దీక్ష

హోరు వానలో జోరు దీక్ష

ఢిల్లీలో భారీ వర్షం.. నిరసన వేదికల్లోకి వాన నీరు

టెంట్లలోకి నీరు చేరి తడిసిన దుప్పట్లు, వస్ర్తాలు, ధాన్యంఅయినా పట్టువీడని రైతులు

న్యూఢిల్లీ: ‘గాలి వానలో.. వాన నీటిలో.. పడవ ప్రయాణం’ ఓ సినీ కవి రాసిన ఈ పాట నూతన వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని డిమాండ్‌ చేస్తూ ఢిల్లీ సరిహద్దుల్లో గత నెల రోజులుగా నిరసనలు చేపడుతున్న రైతన్నల స్థితిని చక్కగా ఆవిష్కరిస్తున్నది. శనివారం అర్ధరాత్రి నుంచి ఆదివారం ఉదయం వరకు ఢిల్లీలో నిరంతరాయంగా కురిసిన ఈదురు గాలులతో కూడిన భారీ వర్షం అన్నదాతలకు కొత్త కష్టాలను తెచ్చి పెట్టింది. అయినప్పటికీ, ఎంత మాత్రం వెరవకుండా రైతులు నిరసన దీక్షను కొనసాగిస్తున్నారు.

టెంట్లలోకి వర్షపు నీరు

ఢిల్లీ, నగర శివారు ప్రాంతాల్లో శనివారం రాత్రి మొదలైన వర్షం ఆదివారం ఉదయం వరకు కొనసాగింది. దీంతో సింఘు, టిక్రీ, ఘాజిపూర్‌ సరిహద్దుల్లో నిరసనోద్యమం చేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. నిరసన వేదికలు, టెంట్ల పరిసరాల్లో వంట చేసుకోవడం కోసం నిల్వ ఉంచిన వంట చెరకు (కట్టెలు) వర్షం నీటిలో మునిగిపోయాయి. గుడారాల్లోకి వరద నీరు చేరి దుప్పట్లు, ఇతర వస్ర్తాలన్నీ తడిసిపోయాయి. చలిని తట్టుకోవడానికి కప్పుకునే దుప్పట్లు లేక శనివారం రాత్రి రైతులు నిద్రలేని రాత్రిని గడిపారు. ఎలాంటి అవాంతరాలు వచ్చినా.. తమ ఉద్యమ స్ఫూర్తిని దెబ్బతీయలేవని రైతు నేత గుర్విందర్‌ సింగ్‌ తెలిపారు. మరోవైపు, జనవరి 13న జరుపుకునే లోహ్రీ (భోగి) పండుగనాడు సాగు చట్టాల ప్రతులను మంటల్లో వేసి నిరసన తెలుపుతామని రైతులు తెలిపారు.నిరసనల్లో భాగంగా తాజాగా మరో ముగ్గురు రైతులు మరణించినట్టు పోలీసులు తెలిపారు. 

కబడ్డీ.. కబడ్డీ

రైతుల్లో కొత్త ఉత్తేజాన్ని నింపేందుకు రైతు సంఘాల నేతలు పలు క్రీడలను నిర్వహించారు. సింఘు సరిహద్దుల్లో ఆదివారం మహిళలకు నిర్వహించిన ‘విమెన్‌ టోర్నమెంట్‌' పలువురిని ఆకర్షించింది. హర్యానా, పంజాబ్‌, రాజస్థాన్‌, యూపీ, ఢిల్లీ నుంచి వచ్చిన మహిళా కబడ్డీ క్రీడాకారులను 12 బృందాలుగా విభజించారు.  జోరు వానను కూడా లెక్కచేయకుండా మహిళలు ఉత్సాహంగా ఈ క్రీడల్లో పాల్గొన్నారు. 

దురహంకార సర్కార్‌

స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇలాంటి దురహంకారపూరిత సర్కారును తానెప్పుడూ చూడలేదని కాంగ్రెస్‌ అధినేత్రి సోనియా గాంధీ కేంద్ర ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.  కొత్త వ్యవసాయ చట్టాలను బేషరతుగా వెనక్కి తీసుకోవాలని ప్రభుత్వాన్ని ఆదివారం డిమాండ్‌ చేశారు.

- సోనియా గాంధీ, కాంగ్రెస్‌ అధినేత్రి