మంగళవారం 11 ఆగస్టు 2020
National - Jul 17, 2020 , 13:17:11

ఢిల్లీలో వర్షం.. అసోంలో వరదలతో 97 మంది మృతి

ఢిల్లీలో వర్షం.. అసోంలో వరదలతో 97 మంది మృతి

ఢిల్లీ : ఢిల్లీలోని పలు ప్రాంతాల్లో శుక్రవారం వర్షం కురిసింది. ఈ సాయంత్రం వరకు రాజధానిలో ఉరుములతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జూలై 20 నాటికి ఢిల్లీతో సహా ఉత్తర భారతదేశంలోని అనేక రాష్ట్రాల్లో రుతుపవనాల కదలిక వేగంగా ఉండడం వల్ల విరివిగా వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఢిల్లీ పరిసర రాష్ట్రాల్లో తక్కువ వర్షపాతం నమోదవుతుండగా అసోం, బీహార్, ముంబైలలో వర్షాలు భారీగా కురుస్తున్నాయి. 

వరదల ధాటికి అసోంలోని 27 జిల్లాల్లోని 40 లక్షల మంది ప్రజలు ప్రభావితమయ్యారు. గురువారం అసోంలో వరదల కారణంగా ఐదుగురు మరణించారు. ముంబైలో వర్షానికి సంబంధించిన సంఘటనల్లో ఇద్దరు మృతి చెందారు. ముంబైలోనే కాదు, గుజరాత్, హిమాచ‌‌ల్‌లో కూడా హెచ్చరికలు జారీ చేయబడ్డాయి. 

హిమాచల్ ప్రదేశ్‌తో పాటు యూపీ, పంజాబ్, హర్యానాలో కూడా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేశారు. గురువారం యూపీలో సాధారణ వర్షపాతం నమోదైంది. అదే సమయంలో హిమాచల్ ప్రదేశ్, పంజాబ్, హర్యానా, రాజస్తాన్‌లలో కూడా తేలికపాటి వర్షం కురిసింది. జూలై 18, 19 తేదీల్లో భారీ వర్షాలకు సంబంధించి రాష్ట్రంలో హెచ్చరిక జారీ చేశారు. రాజస్తాన్‌లోని ఉదయపూర్‌లో రానున్న 24 గంటల్లో భారీ వర్షపాతం నమోదవుతుందని అంచనా.

అసోంలో వరదల కారణంగా ఇప్పటివరకు 97 మంది మరణించారు. ఇందులో వరద కారణంగా 71 మంది, కొండచరియలు విరిగి 26 మంది మరణించారు. ఈ సందర్భంగా అసోం సీఎం సర్బానంద సోనోవాల్ కాజీరంగ నేషనల్ పార్క్ లోని కొన్ని ప్రాంతాలను సందర్శించారు. గోరకాటి, మోరా డిఫాలు, ముర్ ఫులోనిలోని కొన్ని శిబిరాలకు కూడా వెళ్లారు. 3,218 గ్రామాల్లో వరద నీరు ఉందని, 1,31,368.27 హెక్టార్ల పంటలు ధ్వంసమయ్యాయని ఏఎస్‌డీఎంఏ తెలిపింది. 49,313 మంది ఆశ్రయం పొందిన 24 జిల్లాల్లో 748 సహాయ శిబిరాలను నిర్వహిస్తున్నట్లు పరిపాలన శాఖ తెలిపింది. 


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo