మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 07, 2020 , 14:17:52

సౌర విద్యుత్తుతో రైళ్లు.. దేశంలోనే అతిపెద్ద ప్లాంట్

సౌర విద్యుత్తుతో రైళ్లు.. దేశంలోనే అతిపెద్ద ప్లాంట్

భూపాల్ : సౌరశక్తితో రైళ్లను నడిపేందుకు భారతీయ రైల్వేలు సన్నద్ధమవుతున్నది. దేశంలోని అనేక రైల్వే స్టేషన్ల విద్యుత్ అవసరాలను తీర్చడంతోపాటు రైళ్లను నడిపేందుకు సౌరవిద్యుత్తును ఉపయోగించబోతున్నది. మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని బినాలో.. రైల్వే శాఖ తన ఖాళీ స్థలంలో 1.7 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ ఏర్పాటు చేసింది. ఇక్కడి నుంచి 25 కేవీ ఓవర్‌హెడ్ లైన్‌కు అనుసంధానించడం ద్వారా రైళ్లను నడపాలని యోచిస్తున్నారు. సౌరశక్తిని ఉపయోగించి రైళ్లు నడపడం భారతీయ రైల్వే వ్యవస్థలో ఇదే తొలిసారి.

భారత్ హెవీ ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ (భెల్) తో కలిసి సంయుక్తంగా ఈ ప్లాంట్‌ను ఏర్పాటు చేసినట్లు రైల్వే అధికారులు తెలిపారు. ఈ ప్లాంట్ పరీక్షా పనులు ప్రారంభమయ్యాయి. రాబోయే 15 రోజుల్లో విద్యుత్ ఉత్పత్తి ప్రారంభించేందుకు అధికారులు సన్నద్ధమయ్యారు. ప్లాంట్ వద్ద డీసీ కరెంట్‌ను దశలవారీ ఏసీ కరెంట్‌గా మార్చడానికి ప్రత్యేక సాంకేతిక పరిజ్ఞానం ఉపయోగిస్తున్నారు. ఇక్కడి నుంచి నేరుగా ఓవర్‌హెడ్ లైన్‌కు విద్యుత్ సరఫరా అవుతుంది. ఈ ప్లాంటుకు వార్షిక ఉత్పత్తి సామర్థ్యం 2.5 మిలియన్ యూనిట్లు కాగా, దీని వల్ల రైల్వే శాఖకు ఏటా రూ .1.37 కోట్లు ఆదా అవుతుందని అధికారులు భావిస్తున్నారు.

త్వరలో 50 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్ 

ఛత్తీస్‌గఢ్ లోని భిలైలో ఖాళీగా ఉన్న భూమిలో 50 మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌ను ఏర్పాటు చేయాలని రైల్వే శాఖ నిర్ణయించింది. దీనిని కూడా కేంద్రం యొక్క 'ట్రాన్స్మిషన్ యుటిలిటీ'తో అనుసంధానిస్తారు. 2021 మార్చి నాటికి ఇక్కడి నుంచి ఉత్పత్తి ప్రారంభించాలని భావిస్తున్నారు. హర్యానాలోని దీవానాలోని రెండు మెగావాట్ల సౌర విద్యుత్ ప్లాంట్‌లో ఉత్పత్తి ఈ ఏడాది ఆగస్టు 31 నాటికి ప్రారంభం కానున్నది. ఇప్పటివరకు, వివిధ స్టేషన్లు, రైల్వే భవనాల పైకప్పులపై సుమారు 100 మెగావాట్ల సౌర విద్యుత్ సామర్థ్యం గల ప్లాంట్లు ఏర్పాటు చేశారు. రాయ్ బరేలిలోని మోడరన్ కోచ్ ఫ్యాక్టరీలో మూడు మెగావాట్ల సామర్థ్యం గల సోలార్ ప్లాంట్ ప్రారంభించారు.

కార్బన్-న్యూట్రల్ యూనిట్లుగా మారడమే లక్ష్యం

2030 నాటికి రైల్వే స్వచ్ఛమైన కార్బన్-న్యూట్రల్ యూనిట్లుగా మారాలని లక్ష్యంగా పెట్టుకున్నది. ఈ ప్రయత్నంలో భాగంగా ఒకవైపు కార్బన్ ఉద్గారాలను తగ్గించుకోవడంతోపాటు మరొక వైపు చెట్లను నాటడం ద్వారా కార్బన్ సింక్ సిద్ధం చేయాలి. అలాగే మరింత ఎక్కువ సౌరశక్తిని శక్తి వనరుగా ఉపయోగించాలని కూడా లక్ష్యంగా పెట్టుకున్నారు. రైల్వేకు చెందిన ఖాళీ స్థలాలు, షెడ్లు, ప్లాట్‌ఫామ్‌లపై నిర్మించిన భవనాలపై సౌర విద్యుత్ ప్లాంట్లను ఏర్పాటు చేయడం ద్వారా విద్యుత్ పై స్వతంత్రంగా ఉండటానికి ఉపయోగపడటమే కాకుండా పెద్ద మొత్తంలో డబ్బు ఆదా చేయవచ్చని భారతీయ రైల్వే వ్యవస్థ భావిస్తున్నది.


logo