మంగళవారం 14 జూలై 2020
National - Jun 15, 2020 , 14:43:59

రైల్వే ఐసొలేషన్‌ కోచ్‌లను వినియోగించుకుంటున్న రాష్ట్రాలు

రైల్వే ఐసొలేషన్‌ కోచ్‌లను వినియోగించుకుంటున్న రాష్ట్రాలు

న్యూఢిల్లీ: కరోనాపై పోరులో తమ వంతు పాత్రలో భాగంగా వేలాది రైలు కోచ్‌లను ఐసొలేషన్‌ కేంద్రాలుగా రైల్వే శాఖ మార్పిడి చేసింది. అయితే ఇప్పటి వరకు ఇవి ఉపయోగపడలేదు. మరోవైపు దేశవ్యాప్తంగా కరోనా కేసుల తీవ్రత ఇటీవల పెరుగుతున్నది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాల్లోని దవాఖానలు కరోనా రోగులతో నిండిపోతున్నాయి. ఈ నేపథ్యంలో బెడ్లు లేక కొత్త రోగులను చేర్చుకునేందుకు దవాఖానలు నిరాకరిస్తున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో వైద్యం అందక పలువురు ఇబ్బందిపడుతున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే ఐసొలేషన్‌ కోచ్‌లను వినియోగించుకునేందుకు పలు రాష్ట్రాలు ముందుకొస్తున్నాయి. 

ఇప్పటి వరకు 204 కోచ్‌లను నాలుగు రాష్ట్రాలకు పంపినట్లు రైల్వే శాఖ తెలిపింది. అత్యధికంగా ఉత్తరప్రదేశ్‌కు 70, తెలంగాణకు 60, ఢిల్లీకి 54 ఐసొలేషన్‌ బోగీలను అందుబాటులోకి తెచ్చినట్లు చెప్పింది. మరో 5 వేల కోచ్‌లు సిద్ధంగా ఉన్నాయని, రాష్ట్రాలు కోరితే వాటిని తరలిస్తామని పేర్కొంది. కాగా, ఆదివారం ఢిల్లీలో కరోనా పరిస్థితిని సమీక్షించిన కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా కరోనా రోగులకు చికిత్స కోసం 500 రైల్వే  ఐసొలేషన్‌ కోచ్‌లను పంపిస్తామన్నారు.  మరోవైపు ఒక్కో కోచ్‌ను ఐసొలేషన్‌ కేంద్రంగా తీర్చిదిద్దేందుకు రైల్వేకు రూ.67 వేలు ఖర్చవుతున్నది. ఈ లెక్కన ఇప్పటికే సిద్ధం చేసిన 5 వేల కోచ్‌లపై సుమారు రూ.35 కోట్ల వరకు రైల్వేశాఖ వ్యయం చేసినట్లు తెలుస్తున్నది. logo