సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 03, 2020 , 02:38:02

పార్లమెంటులో ఢిల్లీ రగడ

పార్లమెంటులో ఢిల్లీ రగడ
  • దద్దరిల్లిన ఉభయ సభలు..
  • బీజేపీ, కాంగ్రెస్‌ సభ్యుల మధ్య తోపులాట
  • ప్రభుత్వం మొద్దు నిద్ర పోయిందన్న ప్రతిపక్షాలు
  • అమిత్‌ షా రాజీనామాకు డిమాండ్‌..

న్యూఢిల్లీ, మార్చి 2: దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన హింసాకాండ సోమవారం పార్లమెంట్‌లో వేడిని పుట్టించింది. మతఘర్షణలను అదుపుచేయడంలో అధికార పక్షం విఫలమైందని, హస్తిన అగ్నిగుండంగా మారుతుంటే ప్రభుత్వం మొద్దు నిద్ర పోయిందని ప్రతిపక్షాలు  కేంద్రంపై దుమ్మెత్తిపోశాయి. కాంగ్రెస్‌, ఆమ్‌ఆద్మీ పార్టీ, వామపక్షాలు, తృణమూల్‌ కాంగ్రెస్‌, సమాజ్‌వాదీ పార్టీ, బహుజన్‌ సమాజ్‌వాదీ పార్టీ, డీఎంకే తదితర పార్టీలకు చెందిన ఎంపీలు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో రాజ్యసభ వాయిదా పడింది. మరోవైపు, ప్రతిపక్ష సభ్యుల నిరసనల మధ్య కేంద్ర సంస్కృత విశ్వవిద్యాలయాల బిల్లు, 2019ను కేంద్ర మానవ వనరుల అభివృద్ధి శాఖ మంత్రి రమేశ్‌ పోక్రియాల్‌ నిశాంక్‌ ప్రవేశపెట్టారు. 


ఇంకోవైపు, కేంద్ర బడ్జెట్‌ 2020-21కు సంబంధించి జరిగిన పార్లమెంటరీ స్థాయీ సంఘం సమావేశాలకు దాదాపు 95 మంది ఎంపీలు హాజరు కాలేదని రాజ్యసభ చైర్మన్‌ వెంకయ్యనాయుడు తెలిపారు. మరోవైపు ఢిల్లీ హింసాత్మక ఘటనలను ఖండిస్తూ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కాంగ్రెస్‌ మాజీ అధ్యక్షుడు రాహుల్‌ గాంధీ సహా పలువురు పార్టీ ఎంపీలు సోమవారం లోక్‌సభలో నిరసన వ్యక్తం చేశారు. హింసాకాండకు బాధ్యత వహిస్తూ కేంద్ర హోంమంత్రి అమిత్‌ షా తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. దీంతో బీజేపీ సభ్యులు ఆగ్రహంతో కాంగ్రెస్‌ ఎంపీల వైపు దూసుకొచ్చారు. ఫలితంగా ఇరు వర్గాల మధ్య తోపులాట జరిగింది. దీంతో స్పీకర్‌ ఓంబిర్లా సభను వాయిదా వేశారు. మరోవైపు, ఎన్నికలను ప్రభుత్వ వ్యయంతో నిర్వహించాలన్న ప్రతిపాదనకు భారత ఎన్నికల సంఘం(ఈసీఐ) సానుకూలంగా లేదని కేంద్రం తెలిపింది. 





logo