బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 27, 2020 , 17:34:18

రాఫెల్.. శత్రువుల గుండెలు గుబేల్

రాఫెల్.. శత్రువుల గుండెలు గుబేల్

న్యూఢిల్లీ : భారత వాయుసేన అమ్ములపొదిలో మరో ఐదు రాఫెల్ ఫైటర్లు చేరనున్నాయి. ఫ్రాన్స్ నుంచి బయల్దేరిన శుభవార్తను వాయుసేన ట్విట్టర్ ద్వారా పంచుకున్నది. ఈ విమానాలు ఈ నెల 29న పంజాబ్ లోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్థావరానికి చేరుకోనున్నాయి. శత్రువుల గుండెల్లో గుబులు పుట్టించే రాఫెల్ జెట్ ఫైటర్లు వచ్చే నెల తొలి వారంలో యుద్ధ క్షేత్రంలో సేవలందించేందుకు సిద్ధంగా ఉండనున్నాయి.

రాఫెల్ ఫైటర్ ప్రత్యేకతలు చూస్తే.. నిజంగానే శత్రుదేశం గుండె అదురుతుందనడంలో అతిశయోక్తి కాదు. గంటకి 2,222 కిలోమీటర్ల వేగంతో 50 వేల అడుగుల ఎత్తుకు ఎగరగల రాఫెల్ రేంజ్ 3700 కిలోమీటర్లు. ఫైటర్ జెట్ మొత్తం పొడవు 15 మీటర్ల 27 సెంటీమీటర్లు. వింగ్ స్పాన్ చూస్తే.. దాదాపు 11మీటర్లు. ఒకేసారి 9500 కిలోల ఆయుధాలను మోసుకెళ్ల గల సామర్ధ్యం రాఫెల్ సొంతం. ఇది సుఖోయ్ కంటే కూడా 1500 కిలోలు ఎక్కువ మోసుకెళ్తుంది. నిమిషానికి 2,500 రౌండ్లు ఆయుధాలను పేల్చగలదు. అన్నింటికంటే గొప్ప విషయం ఏంటంటే.. అణ్వాయుధాలను కూడా మోసుకెళ్లగలగడం రాఫెల్ ప్రత్యేకత.

పంజాబ్‌లోని అంబాలా ఎయిర్ ఫోర్స్ స్టేషన్‌.. ఇండో-పాక్ సరిహద్దులకు అతి దగ్గర్లోని ఎయిర్ ఫోర్స్ స్టేషన్. పగలూ, రాత్రి తేడా లేకుండా ఎక్కడి లక్ష్యాన్నైనా ఈజీగా  చేధించడం రాఫెల్ స్పెషాల్టీ. సరిహద్దు దాటకుండానే పాక్‌లోని ఓ మూల టార్గెట్‌నైనా ఇట్టే చేధించగలదు. రాఫెల్ జెట్ ఫైటర్ ఉన్న దేశాలు భారత్ కి ముందు మూడే.. అవి ఫ్రాన్స్, ఈజిప్ట్, ఖతార్. ఎయిర్ టు ఎయిర్-మీటియోర్స్ మిస్సైల్స్, ఎయిర్ టూ గ్రౌండ్ స్కాల్ఫ్ మిస్సైల్స్‌ని రాఫేల్‌లో తీసుకెళ్లగలుగుతుంది.

టెండర్లు.. రద్దు.. తిరిగి టెండర్లు

ఇన్ని ప్రత్యేకతలు ఉన్నందునే 19ఏండ్ల క్రితమే అప్పటి వాజ్‌పేయ్ ప్రభుత్వం రాఫెల్‌ ఫైటర్ విమానాలను కొనుగోలు చేయాలనుకున్నది. అయితే 2007లో యూపీఏ హయాంలో కొనుగోళ్ల విషయం ముందుకు కదిలింది. అనేక దేశాలనుంచి టెండర్లను పిలిచింది. కానీ, 2012నాటికే అది అగ్రిమెంట్ దశకి వచ్చింది. రూ.54వేల కోట్ల ఖర్చుతో 126 రాఫెల్ జెట్ ఫైటర్ల కోసం డీల్ కుదుర్చుకున్నది. 18 విమానాలు వెంటనే వచ్చేట్లు, మిగిలినవి బెంగళూరులో హిందుస్తాన్ ఏరోనాటిక్స్‌లో తయారుచేసేట్లు డీల్ కుదిరింది. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన బీజేపీ ఆధ్వర్యంలోని ఎన్‌డీఏ ప్రభుత్వం ఆధ్వర్యంలో 2015 సెప్టెంబర్‌లో ‌ఫ్రాన్స్‌కి వెళ్లిన మోదీ.. యూపీఏ హయాంల చేసుకున్న ఒప్పందాన్ని రద్దు చేశారు. 36 జెట్ ఫైటర్లే కొంటున్నట్లు ప్రకటన చేసారు. ఫ్రాన్స్ కంపెనీ దసో ఏవియేషన్‌తో ఒప్పందం కుదిరింది. ఫస్ట్ బ్యాచ్ రాఫెల్ యుద్ధ విమానాలు రెండేండ్ల క్రితమే ఇండియన్ ఎయిర్‌ఫోర్స్‌లో చేరిపోయాయి.

వారంలోనే రంగంలోకి..

పంజాబ్ లోని అంబాలా వాయుసేన క్షేత్రానికి చేరిన వారం రోజుల్లోనే వీటిని రంగంలోకి దింపే అవకాశాలు ఉన్నాయి. ఆ మేరకు వాయుసేన రంగం సిద్ధం చేస్తున్నట్టుగా తెలుస్తున్నది. సాధారణంగా వీటిని వినియోగంలోకి తీసుకురావడానికి కనీసం ఆరె నెలల సమయం పడుతుంది. అయితే, సరిహద్దులో అత్యవసర పరిస్థితుల కారణంగా అంబాలా చేరిన వారం రోజుల్లోనే కార్యక్షేత్రంలోకి దిగేలా చేయనున్నాను. ఇప్పటికే 12 మంది వాయుసేన పైలటలు ఈ విమానాలను నడిపే శిక్షణను ఫ్రాన్స్ లో తీసుకున్నారు.


logo