గురువారం 16 జూలై 2020
National - Jun 30, 2020 , 01:17:34

రాఫెల్‌ వస్తున్నది!

రాఫెల్‌ వస్తున్నది!

  • డ్రాగన్‌ కోరలు పీకడానికి సిద్ధమవుతున్న భారత్‌ 
  • వచ్చేనెల వాయుసేనలోకి ఆరు రాఫెల్‌ విమానాలు 
  • ఇప్పటికే కీలకమైన యుద్ధవిమానాల తరలింపు 

న్యూఢిల్లీ: చైనా కుట్రలను తిప్పికొట్టేందుకు భారత్‌ తన అస్త్రశస్ర్తాలను సిద్ధం చేసుకుంటున్నది. తూర్పు లఢక్‌లో ఇటీవల దుశ్చర్యలకు పాల్పడిన డ్రాగన్‌ దేశానికి గట్టి గుణపాఠం చెప్పే దిశగా అడుగులు వేస్తున్నది. ఇందులో భాగంగా అత్యంత శక్తిమంతమైన రాఫెల్‌ యుద్ధ విమానాలను సమకూర్చుకుంటున్నది. వచ్చే నెల 27 నాటికి ఆరు అత్యాధునిక జెట్‌ ఫైటర్లు వాయుసేన అమ్ములపొదలోకి చేరనున్నాయి. మరోవైపు, చైనా కంపెనీల భాగస్వామ్యం ఉన్న రూ. 2,900 కోట్ల ప్రాజెక్టును కేంద్రం రద్దు చేసింది. ఇదిలాఉండగా.. ఎల్‌ఏసీకి 423 మీటర్ల దూరంలోని భారత భూభాగంలో స్థావరాలను ఏర్పాటు చేసుకొని చైనా మళ్లీ కవ్వింపులకు పాల్పడుతున్నది.

ఆగస్టు నాటికి గోల్డెన్‌యారో స్కాడ్రన్లు 

శక్తిమంతమైన ఆరు రాఫెల్‌ యుద్ధ విమానాలు  వచ్చే నెల 27న హర్యానాలోని అంబాలా వైమానిక స్థావరానికి చేరే అవకాశమున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి. రాఫెల్‌ జెట్‌ విమానాల్లోని ‘గోల్డెన్‌ యారో’ స్కాడ్రన్లు ఆగస్టు నాటికి సిద్ధం కానున్నాయి. మరోవైపు, మిలిటరీ ట్రాన్స్‌పోర్టుకు అతి కీలకంగా వ్యవహరించే సీ-17 గ్లోబ్‌ మాస్టర్‌, సీ-130 సూపర్‌ హెర్క్యులస్‌, సీహెచ్‌-47 చినూక్‌ యుద్ధవిమానాలను కూడా వాయుసేన సిద్ధం చేస్తున్నది. చైనాతో నెలకొన్న ఉద్రిక్తతల నేపథ్యంలో హిందూ మహాసముద్రంలో భారత నావికాదళం కూడా గస్తీని పెంచింది. ఇదిలా ఉండగా.. సరిహద్దుల్లో నెలకొన్న ప్రతిష్ఠంభనను తొలగించేందుకు భారత్‌-చైనాలకు చెందిన లెఫ్టినెంట్‌ జనరల్‌ స్థాయి సైనికాధికారుల మధ్య మంగళవారం మరో దఫా చర్చలు జరుగనున్నట్టు అధికార వర్గాలు తెలిపాయి.

రూ. 2,900 కోట్ల ప్రాజెక్టు రద్దు!

చైనా కంపెనీల సహకారంతో బీహార్‌లో గంగానది మీదుగా సుమారు 5.6 కిలోమీటర్ల పొడవైన వంతెన నిర్మాణ ప్రాజెక్టును  కేంద్రం రద్దు చేసింది. కాగా, కశ్మీర్‌ లోయలో రెండు నెలలకు సరిపడా ఎల్పీజీని నిల్వ చేసుకోవాలని చమురు సంస్థలకు అధికారులు ఆదేశాలిచ్చారు.

ఆగని చొరబాట్లు

చైనా తన ఆక్రమణల పర్వాన్ని కొనసాగిస్తూనే ఉన్నది. వాస్తవాధీన రేఖ (ఎల్‌ఏసీ)ను దాటి సుమారు 423 మీటర్ల దూరం భారత భూభాగంలోకి ఆ దేశ సైనికులు ప్రవేశించి స్థావరాలను ఏర్పాటు చేసుకున్నట్టు తాజాగా వెల్లడైంది. ఆ ప్రాంతంలో 14 వాహనాలు, ఒక పెద్ద షెల్టర్‌, 16 వరకు టెంట్లు, టార్పాలిన్లు ఉన్నాయని జూన్‌ 25న ‘గూగుల్‌ ఎర్త్‌ ప్రో’ తీసిన ఉపగ్రహ చిత్రాల్లో తేలింది.logo