శనివారం 15 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 16:34:28

గాలిలోనే ఇంధ‌నం నింపుకున్న రాఫెల్

గాలిలోనే ఇంధ‌నం నింపుకున్న రాఫెల్

న్యూఢిల్లీ: ఫ్రాన్స్‌ నుంచి సోమ‌వారం భార‌త్‌కు బ‌య‌లుదేరిన ఐదు రాఫెల్ యుద్ధ విమానాలు మ‌రో ఘ‌న‌త సాధించాయి. మంగ‌ళ‌వారం అవి గాలిలోనే ఇంధ‌నాన్ని నింపుకున్నాయి. దీని కోసం ఫ్రాన్స్ ఎయిర్‌ఫోర్స్ అందించిన స‌హ‌కారాన్ని భార‌త వాయుసేన (ఐఏఎఫ్‌) ప్ర‌శంసించింది. దసాల్ట్‌ సంస్థ తయారు చేసిన అత్యాధునిక రాఫెల్‌ యుద్ధ విమానాల‌ను భార‌త్ స‌మ‌కూర్చుకొంటున్న‌ది. రూ.59,000 కోట్లతో 36 రాఫెల్‌ విమానాల కొనుగోలు కోసం ఫ్రాన్స్‌తో 2016లో భారత్‌ ఒప్పందం కుదుర్చుకుంది. ఒక్కసారి ఇంధనాన్ని నింపుకుంటే 3,700 కి.మీ దూరం వరకు ప్రయాణం చేయగల ఈ విమానాలు గాలిలో ఉండగానే ఇంధనాన్ని నింపుకోగలవు. పైలట్‌లకు రాత్రివేళల్లో స్పష్టంగా కనిపించేందుకు హెల్మెట్‌ మౌంటెడ్‌ డిస్ప్లే, రాడార్‌ రిసీవర్లు, శత్రువుల సిగ్నల్‌ వ్యవస్థలకు అంతరాయం కలిగించే లో-బ్యాండ్‌ జామర్లు,  ఇన్‌ఫ్రారెడ్‌ సెర్చ్‌, ట్రాకింగ్‌ వంటి  వ్యవస్థలు రాఫెల్‌లో ఉన్నాయి. అత్యంత ఎత్తైన ప్రదేశాల్లో అతిశీతల పరిస్థితుల్లో కూడా ఈ విమానాలు సమర్థంగా పోరాడగలవు.

మొదటి దశలో ఐదు విమానాలు ఫ్రాన్స్‌లోని మెరిగ్నాక్‌ వైమానిక స్థావరం నుంచి  సోమ‌వారం భార‌త్ బ‌య‌లుదేరాయి. ఈ విమానాలు బుధవారం అంబాలా ఎయిర్‌ఫోర్స్‌ బేస్‌కు చేరుకుంటాయి. అదేరోజు వాటిని భారత వైమానిక దళంలో చేరుస్తారు. అయితే ఐఏఎఫ్‌కు రాఫెల్స్‌ను అందించే లాంఛన కార్యక్రమం ఆగస్టు చివరలో జరుగనుంది. ఈ యుద్ధ విమానాలను ఇప్పటివరకూ ఫ్రాన్స్‌, ఈజిప్ట్‌, ఖతర్‌ దేశాలు మాత్రమే కలిగి ఉన్నాయి.


logo