శనివారం 15 ఆగస్టు 2020
Ashoka Developers
National - Jul 30, 2020 , 02:59:04

రాఫెల్‌ హీరో ‘హిలాల్‌'

రాఫెల్‌ హీరో ‘హిలాల్‌'

  • అనుకున్న సమయానికి విమానాలు రావడంలో కీలకపాత్ర
  • వాయుసేన అవసరాలకు అనుగుణంగా ఫైటర్లలో మార్పులు 

న్యూఢిల్లీ: భారత వాయుసేన (ఐఏఎఫ్‌) అమ్ములపొదిలోకి ప్రతిష్ఠాత్మక రాఫెల్‌ యుద్ధ విమానాలు వచ్చి చేరాయి. ఫ్రాన్స్‌ నుంచి సోమవారం బయల్దేరిన ఐదు జెట్‌ ఫైటర్లు బుధవారం హర్యానాలోని అంబాలా ఎయిర్‌బేస్‌లో సురక్షితంగా దిగాయి. సరిహద్దుల్లో చైనాతో ఉద్రిక్తతల నేపథ్యంలో ఫ్రాన్స్‌ నుంచి ఇవి అనుకున్న సమయానికి భారత్‌కు చేరుకోవడానికి ఐఏఎఫ్‌ అధికారి హిలాల్‌ అహ్మద్‌ రాథర్‌ (52) కీలకంగా వ్యవహరించారు. అందుకే ఆయనను రాఫెల్‌ హీరోగా ప్రశంసిస్తున్నారు. కశ్మీర్‌లోని అనంత్‌నాగ్‌ వాసి హిలాల్‌ ప్రస్తుతం ఫ్రాన్స్‌లో భారత్‌ ఎయిర్‌ అటాచ్‌గా పనిచేస్తున్నారు. యుద్ధక్షేత్రంలో శత్రువులపై విరుచుకుపడేందుకు రాఫెల్‌లో 13 అత్యాధునిక ఫీచర్లను అందుబాటులోకి తేవడానికి గత ఏడాదంతా తీవ్రంగా శ్రమించారు.

రాఫెల్‌ విమానాల నిర్వహణపై 152 ఐఏఎఫ్‌ నిపుణులు, 27 ఫైటర్‌ ఫైలట్లకు శిక్షణ ఇచ్చారు. 1988 డిసెంబర్‌ 17న ఐఏఎఫ్‌లోని ఫ్లయింగ్‌ విభాగంలో ఫైటర్‌ పైలట్‌గా నియమితులై, ఎయిర్‌ కమోడర్‌ వరకు హిలాల్‌ పలు పదోన్నతులు పొందారు. తన సుదీర్ఘ కెరీర్‌లో వాయుసేన మెడల్‌, విశిష్ట సేవ మెడల్‌, నేషనల్‌ డిఫెన్స్‌ అకాడమీలో స్వార్డ్‌ ఆఫ్‌ ఆనర్‌ పొందారు. ఆయుధసహిత రాఫెల్‌ నడిపిన తొలి పైలట్‌గానూ రికార్డులకెక్కారు. రాఫెల్‌ జెట్‌ ఫైటర్ల రాకపై హిలాల్‌ కీలక పాత్ర పోషించడంపై కశ్మీరీ యువత సోషల్‌ మీడియా వేదికగా ఆయన మీద ప్రశంసల వర్షం కురిపిస్తున్నది. రాఫెల్‌ హీరో సొంతగడ్డపై అడుగు పెట్టారని కొనియాడుతున్నారు.

వివాదాల నడుమ 

భారత వాయుసేన ఆధునికీకరణకు 2007లో నాటి యూపీఏ ప్రభుత్వం ఫ్రాన్స్‌ నుంచి 126 రాఫెల్‌ విమానాలు కొనాలని నిర్ణయించింది. ఏడేండ్లు చర్చలు జరిగినా, ధర, టెక్నాలజీ బదిలీ వంటి అంశాల్లో అంగీకారం కుదరక డీల్‌ ఆగిపోయింది. మోదీ నేతృత్వంలో ఎన్డీయే సర్కార్‌ వచ్చాక మళ్లీ చర్చలు మొదలయ్యాయి. 2016 సెప్టెంబర్‌ 23న మోదీ ఫ్రాన్స్‌ పర్యటనలో రూ.59వేల కోట్లతో 36 విమానాల కొనుగోలుకు ఒప్పందం కుదిరింది. ఫ్రాన్స్‌లోని దసాల్ట్‌ ఏవియేషన్‌ కంపెనీ వీటిని తయారుచేస్తున్నది. 2021 చివరికి మొత్తం 36 విమానాలను సరఫరా చేయాలని ఒప్పందం. తొలిదశలో 5 విమానాలు వచ్చాయి. అయితే, ఈ ఒప్పందంపై దేశంలో తీవ్ర రాజకీయ దుమారం రేగింది. 126 విమానాలకయ్యే వ్యయంతో 36 విమానాలే కొంటున్నారని, ఇందులో భారీ అవినీతి జరిగిందని విపక్షాలు ఆరోపించాయి. సుప్రీంకోర్టులో కేసు కూడా వేశాయి. చివరకు ఒప్పందానికి సుప్రీంకోర్టు క్లీన్‌చిట్‌ ఇవ్వటంతో విమానాల సరఫరా మొదలైంది.

రాఫెల్‌ కథనాలతో.. 

ఆదాయానికి గండి: ఎన్‌.రామ్‌ 

దసాల్ట్‌ కంపెనీ నుంచి ఎక్కువ మొత్తం చెల్లించి 36 రాఫెల్‌ విమానాలను కొంటున్నారంటూ ఆంగ్లపత్రిక హిందూ అప్పట్లో వరుసగా కథనాలు ప్రచురించింది. ఈ ఒప్పందంలో భారీ కుంభకోణం చోటు చేసుకున్నదని ఆ కథనాలు పేర్కొన్నాయి. ప్రస్తుతం ఐదు రాఫెల్‌ విమానాలు భారత్‌కు వచ్చిన సందర్భంగా హిందూ మాజీ ఎడిటర్‌, హిందూ గ్రూపుసంస్థల డైరెక్టర్‌ ఎన్‌.రామ్‌ స్పందిస్తూ.. రాఫెల్‌ కథనాల ప్రచురణ తర్వాత (ప్రభుత్వ) ప్రకటనలు రాక తమ అడ్వైర్టెజింగ్‌ ఆదాయం గణనీయంగా తగ్గిపోయిందని, అయినప్పటికీ తాము తలవంచబోమని చెప్పారు.


logo