శుక్రవారం 10 జూలై 2020
National - Feb 22, 2020 , 11:21:49

న‌మ‌స్తే ట్రంప్ నిర్వాహ‌కులు ఎవ‌రు ?

న‌మ‌స్తే ట్రంప్ నిర్వాహ‌కులు ఎవ‌రు ?

హైద‌రాబాద్‌:  అమెరికా అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్.. ఇండియాకు రావ‌డం శుభ‌సంకేత‌మే.  కానీ అహ్మాదాబాద్‌లో జ‌రిగే ఈవెంట్‌ను ఎవ‌రు నిర్వ‌హిస్తున్నార‌న్న‌ది అంతుచిక్క‌ని ప్ర‌శ్న‌గా మారింది.  మొతెరే స్టేడియాన్ని ప్రారంభించ‌డానికి వ‌స్తున్న ట్రంప్‌ను ఎవ‌రు ఆహ్వానించారు. ఈ ప్ర‌శ్న‌కు బ‌దులు విచిత్రంగా ఉంది.  కేంద్ర ప్ర‌భుత్వం కానీ, గుజ‌రాత్ ప్ర‌భుత్వం కానీ.. ట్రంప్‌ను ఆ ఈవెంట్‌కు ఆహ్వానించ‌లేదు. కానీ డోనాల్డ్ ట్రంప్ నాగ‌రిక్ అభినంద‌న్ స‌మితి అనే ప్రైవేటు సంస్థ అమెరికా అధ్య‌క్షుడిని ఆహ్వానించిన‌ట్లు విదేశాంగ శాఖ ప్ర‌తినిధి రావీశ్ కుమార్ తెలిపారు. 120 కోట్లు ఖ‌ర్చు పెట్టి అంత పెద్ద కార్య‌క్ర‌మాన్ని నిర్వ‌హించ‌డం అవ‌స‌ర‌మా అని కాంగ్రెస్ పార్టీ ప్ర‌శ్నించిన‌ త‌ర్వాత‌.. ఈ ఈవెంట్ నిర్వాహ‌కులు విష‌యాలు బ‌య‌ట‌కు వ‌చ్చాయి.  అయినా కానీ ఆ కార్య‌క్ర‌మ వివ‌రాలు మాత్రం ఇంకా స్ప‌ష్టం కాలేదు.  మూడు గంట‌ల కార్య‌క్ర‌మానికి 120 కోట్లు ఖ‌ర్చు చేస్తారా అని ప్ర‌శ్న‌లు వెల్లువెత్తుతున్నాయి.  ట్రంప్ రాక కోసం  అహ్మాదాబాద్ న‌గ‌రం అంతా సుంద‌రీక‌రించ‌డం.. భారీ భారీ కటౌట్లు పెట్ట‌డం.. ప్ర‌తిప‌క్షాల్లో అనుమానాల‌కు తెర‌లేపుతున్నది. డోనాల్డ్ ట్రంప్ నాగ‌రిక్ అభినంద‌న్ స‌మితి గురించి ఇప్ప‌టి వ‌ర‌కు డిజిట‌ల్ మీడియాలో కూడా స‌మాచారం లేదు.  గ‌త ఏడాది హూస్ట‌న్‌లో జ‌రిగిన హౌడీ మోదీ లాంటి స‌భ త‌ర‌హాలో న‌మ‌స్తే ట్రంప్‌ను నిర్వ‌హిస్తున్నారు. కానీ ఈ కార్య‌క్ర‌మానికి ప్ర‌తిప‌క్ష నేత‌ల్ని ఆహ్వానించ‌క‌పోవ‌డం ఆశ్చ‌ర్యాన్ని క‌లిగిస్తున్న‌ది. 


  


logo