శనివారం 04 జూలై 2020
National - Jun 05, 2020 , 13:51:33

తండ్రిని కడసారి చూసేందుకు కుమార్తెకు 3 నిమిషాల సమయం

తండ్రిని కడసారి చూసేందుకు కుమార్తెకు 3 నిమిషాల సమయం

ఇంఫాల్‌: కరోనా నేపథ్యంలో కన్నవారిని కడసారి తనివితీరా చూసుకునే అదృష్టానికి చాలా మంది నోచుకోవడం లేదు. అనారోగ్యంతో చనిపోయిన తండ్రి భౌతిక కాయాన్ని చూసేందుకు క్వారంటైన్‌లో ఉన్న కుమార్తెకు కేవలం మూడు నిమిషాల సమయం మాత్రమే అధికారులు ఇచ్చారు. ఈ హృదయ విదారకర ఘటన మణిపూర్‌లో జరిగింది. కాంగ్‌పోక్పికి చెందిన అంజలి హ్మాంగ్తె మే 25న చెన్నై నుంచి ప్రత్యేక శ్రామిక్‌ రైలులో సొంతూరుకు తిరిగి వచ్చారు. అయితే ఆమెతోపాటు ప్రయాణించిన ఒకరికి కరోనా పాజిటివ్‌గా రావడంతో కొందరితోపాటు అంజలిని కూడా క్వారంటైన్‌ కేంద్రంలో ఉంచారు. 

వయసురిత్యా అనారోగ్యంతో బాధపడుతున్న అంజలి తండ్రి మంగళవారం రాత్రి చనిపోయారు. ఆయనను కడసారి చూసేందుకు ఆమెకు కేవలం 3 నిమిషాలు మాత్రమే సమయం ఇచ్చారు. దీంతో వ్యక్తిగత రక్షణ దుస్తులు ధరించి క్వారంటైన్‌ కేంద్రం నుంచి బుధవారం ఇంటికి వచ్చిన అంజలి శవపేటికలో నిర్జీవంగా ఉన్న తండ్రిని చూసి తట్టుకోలేకపోయింది. అక్కడే ఉన్న తల్లి, ఇతర బంధువులు ఆమెను ఓదార్చలేని పరిస్థితి. మూడు నిమిషాల అనంతరం సమయం ముగిసిందని అధికారులు చెప్పడంతో అంజలి బాధతో క్వారంటైన్‌ కేంద్రానికి తిరిగి వెళ్లింది. 


logo