సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 14, 2020 , 08:08:14

తిరుపతిలో మరో పుష్పయాగం

తిరుపతిలో మరో పుష్పయాగం

తిరుమల శ్రీవారి ఆలయంలో జరిగిన తరహాలోనే తిరుపతిలో శ్రీనివాసమంగాపురంలోని శ్రీకళ్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయంలో వార్షిక పుష్పయాగం ఈనెల (మార్చి) 20న జరగనుంది. గత నెల (ఫిబ్రవరి) 14 నుంచి 22వ తేది వరకు బ్రహ్మోత్సవాలు జరిగిన సంగతి తెలిసిందే. ఈ కార్యక్రమాలలో భాగంగా తెలిసో తెలియకో దేవదేవునిపట్ల ఏవైనా లోపాలు సంభవిస్తే వాటికి ప్రాయశ్చిత్తంగా ఈ యాగం చేయడం ఆనవాయితీగా వస్తున్నది. దీనివల్ల అర్చక పరిచారకులు, అధికార, అనధికారులు, భక్తజనం అందరిలో ఎవరివల్ల కలిగిన దోషాలేవైనా తొలగిపోతాయని అర్చక పండితులు అంటారు. కన్నుల పండువగా సాగే ఈ పుష్పయాగంలోనూ భక్తులు ప్రత్యక్షంగా పాల్గొనవచ్చు. కేవలం రూ.500 చెల్లించడం ద్వారా ఇందులో పాల్గొనే అవకాశం లభిస్తుంది. ఇలాంటి భక్తులైన గృహస్తులకు ఇద్దరికి రవికె, ఉత్తరీయం బహుమతిగానూ అందజేస్తారని తి.తి.దే. ప్రజాసంబంధాల అధికారి విడుదల చేసిన ప్రకటనలో తెలిపారు. 

పుష్పయాగం కోసం ఒకరోజు ముందుగానే 19వ తేదీన సాయంత్రం 6 గంటల నుంచి 8 గంటల వరకు అంకురార్పణ నిర్వహిస్తారు. 20వ తేది (శుక్రవారం) ఉదయం 10 గంటల నుండి 11 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత కళ్యాణ వేంకటేశ్వర స్వామి వారి ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం నిర్వహిస్తారు. ఇందులో భాగంగా పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనం, కొబ్బరినీళ్లతో స్వామికి అభిషేకం చేస్తారు. మధ్యాహ్నం 2 గంటల నుండి 4.30 గంటల వరకు పుష్పయాగం అత్యంత వైభవంగా జరుగుతుంది. దీనిని కళ్లారా చూడవలసిందే కానీ, వర్ణించడానికి అక్షరాలు చాలవు. ఇందులో తులసి, చామంతి, గన్నేరు, మొగలి, మల్లె, జాజి, సంపంగి, రోజా, కలువలు వంటి అనేక రకాల పుష్పాలతో స్వామివారికి అభిషేకం చేస్తారు. సాయంత్రం 5.30 గంటల నుండి 6.30 గంటల వరకు వీథి ఉత్సవం నిర్వహిస్తారు. ఈ సందర్భంగా ఆలయంలో 19వ తేదీన తిరుప్పావడ సేవ, 20న ఆర్జిత కల్యాణోత్సవం సేవలను టీటీడీ రద్దు చేసింది.


logo