ఆదివారం 29 మార్చి 2020
National - Feb 29, 2020 , 08:59:13

రిటైర్మెంట్‌ వయస్సు తగ్గించిన పంజాబ్‌

రిటైర్మెంట్‌ వయస్సు తగ్గించిన పంజాబ్‌

హైదరాబాద్‌: పంజాబ్‌ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సును తగ్గించనుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు ప్రస్తుతం 60 సంవత్సరాలుగా ఉన్నదాన్ని 58 సంవత్సరాలకు కుదిస్తున్నట్లు పేర్కొంది. ఆ రాష్ట్ర ఆర్థికశాఖ మంత్రి మన్‌ప్రీత్‌ సింగ్‌ బాదల్‌ ఈ మేరకు అసెంబ్లీలో ప్రకటన చేశారు. బాదల్‌ నిన్న అసెంబ్లీలో 2020-21 బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. రూ.1,54,805 కోట్ల బడ్జెట్‌ను ఆయన రాష్ట్ర అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. అధికార కాంగ్రెస్‌ ఎన్నికల వాగ్దాలను నెరవేర్చే దిశగా బడ్జెట్‌లో భారీగా కేటాయింపులు చేశారు. మున్సిపల్‌ పరిధి ఆవల ఏర్పాటు చేసే పరిశ్రమలకు చేంజ్‌ ఆఫ్‌ ల్యాండ్‌ యూజ్‌(సీఎల్‌యూ) చార్జీలను రెండేళ్ల వరకు కొనసాగించనున్నట్లు తెలిపారు. విద్యార్థులందరికీ 12వ తరగతి వరకు ఉచిత విద్య, కౌలు రైతుల రుణమాఫీ, కూరగాయల రైతులకు మండీ ఫీజును 4 శాతం నుంచి 1 శాతానికి తగ్గింపు వంటి ఇతర ప్రధాన అంశాలను ఆయన బడ్జెట్‌లో ప్రస్తావించారు. అదేవిధంగా ఇచ్చిన హామీ మేరకు 10 లక్షల స్మార్ట్‌ఫోన్స్‌ అందజేయడం కోసం బడ్జెట్‌లో రూ.100 కోట్లు కేటాయించారు. కరోనా వైరస్‌ నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్స్‌ దిగుమతి ఆలస్యం అవుతుందని ఈ ఏప్రిల్‌లో ఫోన్ల పంపిణీ చేపట్టనున్నట్లు ఆయన తెలిపారు.


logo