మంగళవారం 04 ఆగస్టు 2020
National - Jul 05, 2020 , 18:37:08

పబ్జీ కోసం 16 లక్షలు ఖర్చు.. స్కూటర్‌ మెకానిక్‌గా మారిన యువకుడు!

పబ్జీ కోసం 16 లక్షలు ఖర్చు..  స్కూటర్‌ మెకానిక్‌గా మారిన యువకుడు!

పంజాబ్‌: పబ్జీ.. ఈ ఆన్‌లైన్‌ గేమ్‌ మాయలో పడి ఎంతోమంది బతుకులు ఆగమైన విషయం తెలిసిందే. కాగా, ఓ పంజాబ్‌ కుర్రాడు వీరందరి కంటే ఓ అడుగు ముందుకేశాడు. పబ్జీకి సంబంధించిన వర్చువల్‌ అమ్యునీషన్‌ (యాప్స్‌) కొనుగోలు కోసం తన తండ్రి బ్యాంకు ఖాతాలోని రూ. 16 లక్షలు ఖర్చు చేశాడు. విషయం తెలుసుకున్న తండ్రి అతడికి డబ్బు విలువ తెలిసిరావాలని స్వయంకృషి సినిమాలో చిరంజీవిలా ఆ కుర్రాడిని స్కూటర్‌ మెకానిక్‌గా పనిలో కుదుర్చాడు.

పంజాబ్‌లోని ఖారర్‌ పట్టణానికి చెందిన ఓ 17 ఏళ్ల కుర్రాడికి పబ్జీ అంటే పిచ్చి. ఇందులో పైచేయి సాధించాలనే కసి. దీంతో తనతోపాటు తన స్నేహితులకోసం కూడా ఈ ఆన్‌లైన్‌ గేమ్‌కు సంబంధించిన యాప్స్‌ కొనుగోలు చేయాలని నిశ్చయించుకున్నాడు. ఆన్‌లైన్‌ క్లాసుల సాకుచెప్పి తన తండ్రి ఫోన్‌ తీసుకున్నాడు. అందులోనుంచి బ్యాంక్‌ ఖాతా ద్వారా రూ. 16 లక్షలు ఖర్చు చేసి, యాప్స్‌ కొనుగోలు చేశాడు. దీంతోపాటు తనతల్లి పీఎఫ్‌ ఖాతానుంచి రూ. 2 లక్షలు విత్‌డ్రా చేశాడు. మొబైల్‌కు వచ్చిన బ్యాంకు స్టేట్‌మెంట్‌ చూసిన అతడి తల్లిదండ్రులు ఖంగుతిన్నారు. కొడుకుకు డబ్బు విలువ ఎలాగైనా తెలియజేయాలని నిశ్చయించుకున్న తండ్రి, ఆ కుర్రాడిని స్థానిక రిపేర్‌ షాప్‌లో స్కూటర్‌ మెకానిక్‌గా పనిలోపెట్టాడు.

ఈ విషయంపై ఆ తండ్రి మాట్లాడుతూ, ఇకపై తన కొడుకును ఖాళీగా ఇంట్లో కూర్చోనివ్వనని, ఆన్‌లైన్‌ క్లాసులని చెప్పినా ఫోన్‌ ఇవ్వబోనని చెప్పాడు. రూ. 16 లక్షలను తమ ఆరోగ్య సంరక్షణతోపాటు కొడుకు భవిష్యత్‌ కోసం బ్యాంకులో దాచిపెట్టామని చెప్పాడు. కాగా, ఆ కుర్రాడే యాప్స్‌ కొనుగోలుకు కావాలని డబ్బులు ఖర్చు చేసినందున కేసు నమోదు చేయడం కుదరదని పోలీసులు చెప్పడం గమనార్హం.


లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డోన్‌లోడ్ చేసుకోండి.


logo