గురువారం 26 నవంబర్ 2020
National - Nov 06, 2020 , 15:27:07

యూపీ, బీహార్‌ నుంచి పంజాబ్‌కు భారీగా ధాన్యం లారీలు

యూపీ, బీహార్‌ నుంచి పంజాబ్‌కు భారీగా ధాన్యం లారీలు

చండీగఢ్‌: ఉత్తరప్రదేశ్‌, బీహార్‌ నుంచి భారీగా ధాన్యం లారీలు పంజాబ్‌ మండీలకు పోటెత్తుతున్నాయి. అయితే స్థానిక రైతులు వీటిని అడ్డుకుని నిరసన తెలుపుకున్నారు. పంజాబ్‌ ఆహార, పౌర సరఫరా శాఖ అధికారుల ఫిర్యాదుతో యూపీ, బీహార్‌ నుంచి ధాన్యం లోడుతో వచ్చిన లారీలు, మధ్యవర్తులపై గత వారం 69 కేసులు నమోదయ్యాయి. మరోవైపు ఇతర రాష్ట్రాల నుంచి పంట ఉత్పత్తులతో వచ్చే లారీలను పంజాబ్‌ రైతులు అడ్డుకుంటున్నారు. దీంతో ఆ రాష్ట్రం వెలుపల వందలాది లారీలు నిలిచిపోయాయి. కేంద్ర ప్రభుత్వం ఇటీవల తెచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా పంజాబ్ రైతులు గత కొన్ని నెలలుగా నిరసనలు కొనసాగిస్తున్నారు.

మరోవైపు కేంద్రం పేర్కొన్న కనీస మద్దతు ధర లభించడం లేదని బీహార్‌, ఉత్తరప్రదేశ్‌ రైతులు వాపోతున్నారు. వరికి క్వింటాల్‌కు రూ.1,868 మద్దతు ధరను కేంద్రం ప్రకటించినా రైతులు పండించిన పంటను కొనుగోలు చేయలేకపోతున్నది. మరోవైపు క్వింటాల్‌కు రూ.1,100 మాత్రమే చెల్లిస్తామని దళారులు చెబుతున్నారు. కాగా పంటను రైతులు ఎక్కడైనా అమ్ముకోవచ్చని ఇటీవల తెచ్చిన చట్టాల్లో కేంద్రం పేర్కొన్నది. ఈ నేపథ్యంలో కనీస మద్దతు ధర లభించే పంజాబ్‌ మార్కెట్‌లో ధాన్యాన్ని అమ్ముకునేందుకు బీహార్‌, ఉత్తరప్రదేశ్‌కు చెందిన రైతులు ప్రయత్నిస్తున్నారు. దళారుల ద్వారా తమ పంటను లారీల్లో అక్కడికి తరలిస్తున్నారు. 

అయితే ఇతర రాష్ట్రాల నుంచి వరి లోడుతో వచ్చే లారీలను పంజాబ్‌ రైతులు అడ్డుకుంటున్నారు. అధికారులకు సమాచారం అందించడంతో వారి ఫిర్యాదు మేరకు పోలీసులు పలు సెక్షన్ల కింద కేసులు నమోదు చేస్తున్నారు. హర్యానా సరిహద్దులోని పాటియాలా జిల్లాలోనే 60 కేసులు నమోదైనట్లు పోలీసులు తెలిపారు. వ్యాపారులు, దళారులు, కమిషన్‌ ఏజెంట్లు కలిసి అంతర్‌ రాష్ట్ర అక్రమ తరలింపునకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. ఈ పరిస్థితుల నేపథ్యంలో తమ పంటలను అమ్ముకోలేక బీహార్‌, ఉత్తరప్రదేశ్‌తోపాటు పంజాబ్‌ రైతులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.