శనివారం 30 మే 2020
National - May 16, 2020 , 01:54:29

వరిని వదిలిన పంజాబ్‌ రైతు

వరిని వదిలిన పంజాబ్‌ రైతు

వానకాలంలో ఇతర పంటలవైపు మొగ్గు

సాగులో సమస్యలు అధికం కావటమే కారణం

అవసరానికి మించి ఉత్పత్తితో ఆదరణ కరువు

హైదరాబాద్‌, నమస్తే తెలంగాణ: రైతు ఆలోచన మారుతున్నది. అతికష్టం, అతితక్కువ ఆదాయం అనే పరిస్థితుల నుంచి బయటపడేందుకు తన సంప్రదాయ సాగు విధానాన్ని మార్చుకుంటున్నాడు. వాతావరణ మార్పులతోపాటు వేగంగా మారిపోతున్న మార్కెట్‌ విధానాలతో వీలైనంత ఎక్కువ లాభపడే పంటలే పండిస్తున్నాడు. వానకాలం పంట అంటే వరి మాత్రమే అని దశాబ్దాలుగా బలంగా నమ్ముతూ వస్తున్న పంజాబ్‌ కూడా రైతులు ఇతర పంటలవైపు మొగ్గుతున్నారు. ఎక్కువమంది రైతులు వరిని వదిలేసి పత్తిలాంటి ఇతర పంటలవైపు మొగ్గుచూపుతున్నారు. ముందుచూపుతో అక్కడి ప్రభుత్వం కూడా వానకాలంలో వరిసాగుకు బదులుగా ఇతర పంటల సాగును ప్రోత్సహిస్తున్నది. 2018 వానకాలంలో పంజాబ్‌లో పత్తి సాగు 2.84 లక్షల హెక్టార్లు ఉండగా, 2019 వానకాలంలో అది 4లక్షల హెక్టార్లకు పెరిగింది. 2020 వానకాలంలో పత్తిసాగుచేలా రైతులను మరింతగా ప్రోత్సహిస్తున్నామని పంజాబ్‌ వ్యవసాయశాఖ కార్యదర్శి కహన్‌సింగ్‌ పన్ను తెలిపారు.  

సమస్యలెక్కువ.. ఫలితం తక్కువ

భవిష్యత్తు పరిణామాలను దృష్టిలో పెట్టుకుంటే వానకాలంలో వరిసాగును తగ్గించటమే మేలని వ్యవసాయ పరిశోధకులు చెప్తున్నారు. ఇతర పంటలతో పోల్చితే వరికి భారీమొత్తంలో సాగునీరు, కూలీలు అవసరం. మనదేశంలో వరి సాగులో యంత్రాల వాడకం అంతంతమాత్రమే. మరీ ముఖ్యంగా తెలంగాణవంటి పీఠభూమి ప్రాంతంలో వరిసాగులోని అన్నిదశల్లో యంత్రాలను వాడటం అసాధ్యం. దాంతో వానకాలం పంట సమయంలో వరి రైతులు కూలీల కొరతతో సతమతమవుతున్నారు. అడిగినంత కూలీ ఇస్తామన్నా పనిలోకి వచ్చేవారు కరువవుతున్నారు. ప్రజలు వ్యవసాయరంగం నుంచి ఇతర ఉపాధి మార్గాలకు మల్లటం కూడా కూలీల కొరతకు ఒక కారణమని నిపుణుల అంటున్నారు. యాసంగితో పోల్చితే వానకాలంలో వరికి చీడపీడలు, కలుపు బెడద కూడా అధికంగా ఉంటుందని చెప్తున్నారు. అంతేకాకుండా మారుతున్న వాతావరణ పరిస్థితులతో ఏటేటా తుఫాన్ల సంఖ్య, తీవ్రత పెరుగుతున్నది. దాంతో వానకాలంలో వేసిన వరిపంట కోతకొచ్చే సమయానికి భారీ తుఫాన్లు సంభవించి అపారమైన పంటనష్టం జరుగుతున్నది. తుఫాన్లవల్ల ఇతర మెట్టపంటలతో పోల్చితే వరికి నష్టం ఎక్కువగా ఉంటున్నదని వ్యవసాయ నిపుణులు అంటున్నారు. వినియోగంకంటే ఉత్పత్తి అధికం

బియ్యం ఉత్పత్తి గత కొన్ని సంవత్సరాలుగా భారీగా పెరుగుతుండటంతో మిగులు ఏర్పడుతున్నది. భారతదేశంలోనే కాకుం డా ప్రపంచవ్యాప్తంగా కూడా గత కొన్నేండ్లుగా ఇదే పరిస్థితి కొనసాగుతున్నది. ఈ ఏడాది భారత్‌తోపాటు వరిని పండించే దేశాల్లో పంట విపరీతంగా పండటంతో ఉత్పత్తి మరింత పెరుగుతుందని, దాంతో డిమాండ్‌ పడిపోతుందని అమెరికా వ్యవసాయశాఖ తన నివేదికలో పేర్కొంది.   logo