బుధవారం 25 నవంబర్ 2020
National - Oct 21, 2020 , 03:08:32

కేంద్రానికి పంజాబ్‌ కౌంటర్‌

కేంద్రానికి పంజాబ్‌ కౌంటర్‌

  • మోదీ వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా సొంత చట్టాలు
  • నాలుగు బిల్లులను ఆమోదించిన పంజాబ్‌ అసెంబ్లీ 
  • రైతులకోసం పదవిని వదులుకొనేందుకైనా సిద్ధం: అమరిందర్‌

చండీగఢ్‌: కేంద్ర ప్రభుత్వం తెచ్చిన వివాదాస్పద వ్యవసాయ చట్టాలను తిరస్కరిస్తూ పంజాబ్‌ ప్రభుత్వం సొంత వ్యవసాయ బిల్లులను తీసుకొచ్చింది. ఈ మేరకు నాలుగు బిల్లులను మంగళవారం పంజాబ్‌ అసెంబ్లీ ఏకగ్రీవంగా ఆమోదించింది. కేంద్ర చట్టాలకు వ్యతిరేకంగా ఓ తీర్మానాన్ని కూడా ఆమోదించింది. అనంతరం సీఎం అమరిందర్‌సింగ్‌, బీజేపీ మినహా అన్ని పార్టీల ఎమ్మెల్యేలను వెంటబెట్టుకొని గవర్నర్‌ వీపీ సింగ్‌ బద్నోర్‌ను కలిశారు. అసెంబ్లీ ఆమోదించిన బిల్లులకు ఆమోదముద్ర వేయాలని విజ్ఞప్తి చేశారు. కేంద్ర వ్యవసాయ చట్టాలను మొదటినుంచీ వ్యతిరేకిస్తున్న పంజాబ్‌.. రాజ్యాంగంలో ఉమ్మడి జాబితాలోని అధికారాలను ఉపయోగించుకొని ఈ బిల్లులకు రూపకల్పన చేసింది. అవి 1. రైతులకు (సాధికారత, భద్రత) వ్యవసాయోత్పత్తుల ధర హామీ, వ్యవసాయ సేవల(ప్రత్యేక నిబంధనలు, పంజాబ్‌ సవరణలు) బిల్లు-2020, 2. రైతు ఉత్పత్తుల వాణిజ్య, వ్యాపార (ప్రోత్సాహకాలు, ప్రత్యేక నిబంధనలు, పంజాబ్‌ సవరణలు) బిల్లు-2020, 3.నిత్యావసర సరుకుల (ప్రత్యేక నిబంధనలు, పంజాబ్‌ సవరణలు) బిల్లు-2020, 4. సివిల్‌ ప్రొసీజర్‌ కోడ్‌ బిల్లు- 2020.  ఈ బిల్లులపై చర్చకు బీజేపీ ఎమ్మెల్యేలు హాజరుకాలేదు. గవర్నర్‌ను కలిసిన అనంతరం అమరిందర్‌ మాట్లాడుతూ ఈ బిల్లులపై రాష్ట్రపతికి  వివరించేందుకు సమయం కోరినట్టు చెప్పారు. అంతకుముందు సభలో బిల్లులపై చర్చ సందర్భంగా మాట్లాడిన అమరిందర్‌సింగ్‌, రాష్ట్ర రైతులకోసం సీఎం పదవి వదులుకోవటానికైనా సిద్ధమని ప్రకటించారు. తన ప్రభుత్వాన్ని బర్తరఫ్‌ చేసినా భయపడనని పేర్కొన్నారు.