శనివారం 28 మార్చి 2020
National - Mar 21, 2020 , 13:27:37

విదేశాలకు వెళ్లలేదు.. పుణె మహిళకు కరోనా పాజిటివ్‌

విదేశాలకు వెళ్లలేదు..  పుణె మహిళకు కరోనా పాజిటివ్‌

ముంబయి : ఆ మహిళ విదేశాలకు వెళ్లలేదు. విదేశాల నుంచి ఆమె ఇంటికి కూడా ఎవరూ రాలేదు. కానీ సదరు మహిళకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. ఇప్పటి వరకు దేశంలో నమోదైన కరోనా కేసుల్లో ఒక్కటి కూడా ఇక్కడ నమోదైన కేసు కాదు. ఇతర దేశాల నుంచి వచ్చిన వారితో పాటు వారితో సన్నిహితంగా ఉన్న వారికి మాత్రమే కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యాధికారులు వెల్లడించారు. 

పుణెకు చెందిన ఓ 40 ఏళ్ల మహిళ గొంతు నొప్పితో బాధపడుతోంది. దీంతో స్వైన్‌ఫ్లూ అని భావించిన ఆ మహిళ పుణెలోని నేషనల్‌ ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ వైరాలజీ కేంద్రానికి వెళ్లి పరీక్షలు చేయించుకుంది. ఆ పరీక్షల్లో ఆమెకు కరోనా పాజిటివ్‌ వచ్చినట్లు వైద్యులు నిర్ధారించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉంది. భారతి ఆస్పత్రిలోని ఐసీయూలో వెంటిలేటర్‌పై చికిత్స పొందుతున్నారు. 

ఈ సందర్భంగా పుణె కలెక్టర్‌ నావల్‌ కిశోర్‌ రామ్‌ మాట్లాడుతూ.. ఈ కేసును తాము విచారిస్తున్నామని తెలిపారు. ఆమె విదేశాలకు వెళ్లలేదు. విదేశాల నుంచి ఎవరూ కూడా ఆమె నివాసానికి రాలేదు. అయినప్పటికీ ఆమెకు కరోనా పాజిటివ్‌ వచ్చింది. అయితే నవీ ముంబయిలో మార్చి 3న జరిగిన ఓ వివాహానికి ఆమె హాజరయ్యారు. ఇక్కడే విదేశీ ప్రయాణం చేసి ఉన్న వ్యక్తి ఉండొచ్చని కలెక్టర్‌ పేర్కొన్నారు. 


logo