శనివారం 05 డిసెంబర్ 2020
National - Nov 15, 2020 , 18:01:21

చెత్తతోపాటు బంగారమున్న బ్యాగును పడేసింది..!

చెత్తతోపాటు బంగారమున్న బ్యాగును పడేసింది..!

పుణె: దీపావళి.. పెద్ద పండుగ. అందరూ ఇంటిని శుభ్రపరుచుకుంటారు. పాతసామాన్లను వెదికిమరీ బయటపడేస్తుంటారు. అలా ఓ మహిళ పాత సామాన్లతోపాటు బంగారం ఉంచిన బ్యాగును కూడా చెత్తబండిలో వేసింది. అనంతరం బ్యాగ్‌లో బంగారం ఉందనే విషయం గుర్తుకువచ్చి శానిటరీ అధికారులను సంప్రదించింది. చాలాసేపు శ్రమించి సిబ్బంది ఆమె బ్యాగును గుర్తించి అప్పగించగా, ఊపిరిపీల్చుకుంది. 

పుణెలోని పింపుల్-సౌదాగర్ ప్రాంతంలో నివసిస్తున్న సెలుకర్ దీపావళికి ముందురోజు ఇంటిని శుభ్రం చేసింది. చెత్తతోపాటు చిన్నబ్యాగును చెత్తబండికి అప్పగించింది. రెండు గంటల తర్వాత ఆమెకు ఆ బ్యాగులో రూ. మూడు లక్షల విలువైన బంగారం ఉందని గుర్తుకొచ్చింది.  వెంటనే  సెలుకర్.. సంజయ్ కుటే అనే స్థానిక సామాజిక కార్యకర్తను సంప్రదించింది. అతడు ఈ విషయాన్ని పీసీఎంసీ ఆరోగ్య శాఖ బృందానికి తెలియజేశాడు.  శానిటరీ ఇన్‌స్పెక్టర్‌ సుశీల్‌మలయ్‌కు సమాచారం అందగా, అతడు డేటా అనలిస్ట్‌ హేమంత్‌ లఖన్‌ను అప్రమత్తం చేశాడు. అతడు చెత్తను గాలించి బంగారం ఉన్న సంచిని గుర్తించాడు.  ఈ బ్యాగు కనుగొనేందుకు 18 టన్నుల చెత్తను జల్లెడపట్టారు. 40 నిమిషాల సమయం పట్టిందట. అనంతరం సెలుకర్ కుటుంబాన్ని చెత్త డంప్‌కు పిలిపించి, బ్యాగ్‌ అప్పగించారు. హేమంత్ లఖన్ కు వారు కృతజ్ఞతలు తెలిపారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.