పుణే : మహారాష్ట్రలోని పుణేలో కూరగాయల విక్రేత కుమారుడు 25 ఏండ్ల హృషీకేష్ రస్కర్ తన కలం నిజం చేసుకున్నాడు. ఈకామర్స్ దిగ్గజం అమెజాన్‌లో తాను కోరుకున్న జాబ్ కొట్టేశాడు. ఐఐటీ రూర్కీలో గ్రాడ్యుయేషన్ పూర్తి చేసుకున్న రస్కర్ తొలుత తాను ఆశించిన ఉద్యోగం లభించకపోవడంతో టెక్ కంపెనీల్లో రొటీన్ కొలువులను వదులుకున్నాడు. తమ ఆర్థిక పరిస్ధితి అంతంతమాత్రం కావడంతో ఆన్లైన్లో ట్యూషన్లు చెప్పి మరీ ఉన్నత విద్యను అభ్యసించి ఆపై తన కల నెరవేర్చుకున్నాడు.
బ్యాకెండ్ ఇంజనీర్లో నైపుణ్యాలు సాధించిన రస్కర్ తాను కోరుకున్న ఉద్యోగం సాధించేందుకు రోజుకు 12 నుంచి 14 గంటలు కష్టపడ్డాడు. తనకు మద్దతుగా నిలిచి ప్రోత్సహించిన కుటుంబ సభ్యులు, స్నేహితులకు ధన్యవాదాలు తెలిపారు. తాను ఇంజనీరింగ్ కాన్సెప్ట్స్‌ను మెరుగ్గా తిరిగి నేర్చుకుని సొల్యూషన్స్ కనుగొనేందుకు తన విజ్ఞానాన్ని మలిచేలా కసరత్తు సాగించానని ప్రపంచ యువనైపుణ్యాల దినోత్సవం సందర్భంగా రస్కర్ చెప్పుకొచ్చాడు. భారీ ప్యాకేజ్‌తో తాను కోరుకున్న ఉద్యోగంలో రస్కర్ కుదురుకోవడంతో ఇక తమ కష్టాలు తీరినట్టేనని అతడి కుటుంబం ఆనందం వ్యక్తం చేస్తోంది.