పుణె, జూన్ 6: కరోనా వైరస్ మూలాలు ఉన్నది చైనాలోని సీఫుడ్ మార్కెట్లో కాదని, అక్కడి వుహాన్‌లోని వైరాలజీ ల్యాబ్ (డబ్ల్యూఐవీ) లోనే ఆ మహమ్మారి పుట్టిందన్న వాదనకు బలం చేకూర్చే ఆధారాలను పుణెకు చెందిన శాస్త్రవేత్తల జంట కనుగొన్నది. కరోనా మూలాలకు సంబంధించిన వివాదంలో ఇప్పుడు వారు 2012లో జరిగిన ఘటనకు సంబంధించి గతేడాది సమీక్షించిన పత్రాలే కీలకంగా మారాయి. ఆ దంపతుల పేర్లు డాక్టర్ మోనాలీ రహల్కర్, డాక్టర్ రాహుల్ బహులికర్. కరోనా వైరస్‌కు సంబంధం ఉందని భావిస్తున్న చైనాలో చోటుచేసుకున్న ఒక ఘటనపై వారు దర్యాప్తు చేశారు. ఆ ఘటన 2012లో జరిగింది. ఆ వివరాలు వారు తెలిపారు.
పరిశోధనలో భాగంగా చైనాలోని మోజియాంగ్లో ఉన్న రాగి గనికి సంబంధించిన డాక్యుమెంట్లు వారికి లభించాయి. వాటి ప్రకారం అది ఓ మూసివేసిన గని. గబ్బిలాల రెట్టలతో నిండిపోయిన గని మైన్షాఫ్ట్ను శుభ్రం చేయడానికి ఆరుగురు వ్యక్తులను నియమించారు. రెట్టలను వారు తొక్కడంతో, అవి పొడిగా మారి అక్కడి గాలి కలుషితమైంది. ఆ వ్యక్తులు కొన్ని రోజుల తర్వాత తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ప్రస్తుత కరోనా రోగుల్లో మాదిరిగా అప్పుడు వారిలో కూడా జ్వరం, దగ్గు, రక్తం గడ్డ కట్టడం వంటి లక్షణాలు కనిపించాయి. అలసట, నిమోనియాతో కూడా వారు బాధపడ్డారు. శ్వాసనాళాల్లో కూడా అడ్డంకులు ఏర్పడ్డాయి. చివరకు ఆ ఆరుగురిలో ముగ్గురు మరణించారు. అయితే, వీళ్లు ఫంగస్ వల్లే మరణించారని డబ్ల్యూఐవీ డైరెక్టర్ డాక్టర్ షీ జెంగ్లీ తెలిపారు. అయితే ముగ్గురు కార్మికుల మరణాలకు ఫంగస్ కారణం కాదని, మరేదైనా ఉండొచ్చని పుణె దంపతులు అభిప్రాయపడ్డారు.
ఈ మేరకు పరిశోధన పత్రాల్లో వెల్లడించారు. ఈ వాదనను డ్రాస్టిక్ అనే పేరుగల నిపుణుల బృందం సమర్థించింది. కార్మికుల మృతికి ఆర్‌ఏటీజీ13 అనే గబ్బిలాల్లో కనిపించే వైరస్ కారణమని తెలిపింది. మృతుల నమూనాలపై డబ్ల్యూఐవీలో పరిశోధనలు జరిగాయని, అనంతరం అక్కడ నుంచి వైరస్ లీక్ అయినట్టు అనుమానాలు వ్యక్తం చేసింది. గుహలో కార్మికులు అస్వస్థతకు గురైనప్పటికీ, వారి కుటుంబసభ్యులెవరికీ అది సోకలేదని, ఎప్పుడైతే డబ్ల్యూఐవీకి నమూనాలు చేరాయో.. తర్వాతనే వైరస్ వ్యాప్తి వార్తలు వచ్చాయని రహల్కర్ తెలిపారు. ‘ఆర్‌ఏటీజీ13’ జన్యుక్రమం, ప్రస్తుత సార్స్-కొవ్-2 జన్యుక్రమం 96.2 శాతం వరకు పోలిఉన్నట్టు తేలింది. ప్రపంచవ్యాప్తంగా కరోనా రోగుల రేడియాలజికల్ రిపోర్టులు… మోజియాంగ్కు చెందిన ఆ ఆరుగురు కార్మికుల రిపోర్టులు ఒకేలా ఉన్నాయని డాక్టర్ రహల్కర్ తెలిపారు. ఊపిరితిత్తుల సీటీ స్కాన్ల మధ్య కూడా సారూప్యతలు ఉన్నాయని చెప్పారు.