శుక్రవారం 14 ఆగస్టు 2020
National - Jul 28, 2020 , 14:57:01

పుణెలో దేశంలోనే తొలి వర్టికల్‌ కొవిడ్‌ కేసు నమోదు

పుణెలో దేశంలోనే తొలి వర్టికల్‌ కొవిడ్‌ కేసు నమోదు

పుణె: ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాకు సంబంధించి మరో చేదునిజం బయటపడింది. తల్లి గర్భంలోనే శిశువుకు వైరస్‌ సోకిన దేశంలోనే తొలి కేసు మహారాష్ట్రలోని పుణెలో వెలుగుచూసింది. దీనినే ‘వర్టికల్‌ ట్రాన్స్‌మిషన్‌’ అని పిలుస్తారని వైద్యులు చెబుతున్నారు.  అంటే శిశువు గర్భాశయంలో ఉండగానే, తల్లి మాయ ద్వారా వైరస్‌ బదిలీ అవుతుందట.

ఈ విచిత్రమైన తొలికేసు పుణెలోని సాసూన్‌ జనరల్‌ హాస్పిటల్‌లో నమోదైంది. దీని గురించి ఆ దవాఖాన పీడియాట్రిక్స్‌ విభాగం అధిపతి డాక్టర్‌ ఆర్తి కినికల్‌ విలేకరులకు వెల్లడించారు. శిశువు గర్భాశయంలో ఉన్నప్పుడు తల్లికి వైరస్‌ సోకితే లక్షణాలున్నా.. లేకున్నా అది శిశువుకు బదిలీ అవుతుందని ఆమె తెలిపారు. తమ దవాఖానలో గుర్తించిన కేసు కూడా ఈ కోవకు చెందినదే అని వివరించారు. తల్లికి ప్రసవానికి ముందు కొవిడ్‌ లక్షణాలున్నాయని తెలిపారు. అయితే ఇండియన్‌ కౌన్సిల్‌ ఆఫ్‌ మెడికల్‌ రీసెర్చ్‌ ప్రకారం ఆర్‌టీ పీసీఆర్‌(కొవిడ్‌)టెస్ట్‌లు నిర్వహించామని, నెగెటివ్‌ రావడంతో శస్త్రచికిత్స చేశామన్నారు.  

శిశువు పుట్టిన తర్వాత ముక్కు, బొడ్డుతాడు, మాయను పరీక్షించగా, కరోనా పాజిటివ్‌గా తేలిందని కినికర్‌ వివరించారు. పుట్టిన రెండు, మూడు రోజుల తర్వాత జ్వరం రావడంతో అనుమానం వచ్చి, తాము ఈ పరీక్షలు నిర్వహించామని చెప్పారు. శిశువును ఇంటెన్సివ్‌ కేర్‌లో ఉంచి చికిత్స అందించామని, ప్రస్తుతం తల్లీబిడ్డ కోలుకోగా డిశ్ఛార్జ్‌ చేశామని చెప్పారు. ఇది తమకు చాలా సవాలుగా నిలిచిందని పేర్కొన్నారు. ఈ కేసును త్వరలోనే ఒక ప్రసిద్ధ అంతర్జాతీయ జర్నల్‌లో ప్రచురించనున్నట్లు కినికర్‌ పేర్కొన్నారు. కాగా, తల్లీబిడ్డకు చికిత్స చేసిన వైద్యులను అభినందిస్తున్నట్లు సాసూన్ జనరల్‌ హాస్పిటల్‌ డీన్‌ డాక్టర్‌ మురళీధర్‌ తాంబే పేర్కొన్నారు. ఇది దేశంలోనే తొలి వర్టికల్‌ కొవిడ్‌ కేసు అని ఆయన తెలిపారు.  లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo