ఆదివారం 23 ఫిబ్రవరి 2020
మీ త్యాగాలు మరువలేం

మీ త్యాగాలు మరువలేం

Feb 15, 2020 , 03:09:27
PRINT
మీ త్యాగాలు మరువలేం
  • పుల్వామా ఘటనకు ఏడాది పూర్తి
  • నివాళులర్పించిన ఆసేతు హిమాచలం
  • జవాన్ల సేవలను కొనియాడిన ప్రధాని మోదీ
  • సైనికుల త్యాగాలను బీజేపీ వాడుకున్నది: కాంగ్రెస్‌

న్యూఢిల్లీ, ఫిబ్రవరి 14: పుల్వామా ఘటనలో అమరులైన 40 మంది జవాన్ల త్యాగాలను దేశం ఎన్నటికీ మరిచిపోదని ప్రధానమంత్రి నరేంద్రమోదీ కొనియాడారు. గత ఏడాది ఫిబ్రవరి 14న జమ్ముకశ్మీర్‌లోని పుల్వామా జిల్లా లెథ్‌పోరా వద్ద సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై జైషే మహ్మద్‌ ఉగ్రవాదులు కారుబాంబుతో దాడిచేసి 40 మంది జవాన్లను పొట్టనబెట్టుకున్న సంగతి తెలిసిందే. ఈ మారణహోమానికి శుక్రవారంతో ఏడాది పూర్తయింది. ఈ సందర్భంగా అమరవీరులకు ప్రధాని మోదీ, రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌సింగ్‌, కాంగ్రెస్‌ నేత రాహుల్‌ గాంధీ, ఢిల్లీ సీఎం అరవింద్‌ కేజ్రీవాల్‌, కేంద్రమంత్రులు, నేతలు, దేశవ్యాప్తంగా ప్రజలు నివాళులు అర్పించారు. 


వారంతా గొప్ప వీరులు

ప్రధాని మోదీ స్పందిస్తూ.. పుల్వామా దాడిలో మరణించిన ప్రతి ఒక్కరూ ‘గొప్ప వీరుల’ని కొనియాడారు. ‘గత ఏడాది పుల్వామా ఘటనలో వీరమరణం పొందిన ప్రతి సైనికుడికి నివాళులు అర్పిస్తున్నా. వారంతా గొప్ప వీరులు. దేశ సేవలో భాగంగా, మాతృభూమి రక్షణ కోసం తమ విలువైన ప్రాణాలను త్యాగం చేశారు. వారి త్యాగాలను భారతదేశం ఎన్నటికీ మరువదు’ అని మోదీ ట్వీట్‌ చేశారు. ‘పుల్వామా దాడిలో అమరులైన సీఆర్పీఎఫ్‌ సిబ్బందికి నా నివాళులు. వారి త్యాగాలను దేశం ఎన్నటికీ మరువదు. ఉగ్రవాదంపై పోరులో దేశమంతా ఐక్యంగా ఉంటుంది. ఇలాంటివాటికి జడువకుండా మా పోరాటాన్ని కొనసాగిస్తాం’ అని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ ట్వీట్‌ చేశారు. అమరవీరులకు హృదయపూర్వకంగా నివాళులు అర్పిస్తున్నట్టు ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్‌ కేజ్రీవాల్‌ పేర్కొన్నారు. ఉగ్రవాదాన్ని కూకటివేళ్లతో సహా పెకలించివేసేందుకు మనమంతా ఐక్యంగా ఉండాలని బీజేపీ అధ్యక్షుడు జేపీ నడ్డా పిలుపునిచ్చారు. 


త్యాగాలను రాజకీయాలకు వాడుకున్నారు 

పుల్వామా ఘటనలో అమరులైన జవాన్ల త్యాగాలను బీజేపీ ఎన్నికల ప్రయోజనాలకు వినియోగించుకున్నదని కాంగ్రెస్‌ పార్టీ విరుచుకుపడింది. రాహుల్‌గాంధీ ట్విట్టర్‌లో స్పందిస్తూ ప్రశ్నల వర్షం కురిపించారు. ‘ఈరోజు 40 మంది సీఆర్పీఎఫ్‌ అమర జవాన్లను గుర్తు చేసుకుంటున్నాం. అయితే.. 1. ఈ దాడి వల్ల ఎవరు ఎక్కువగా లబ్ధి పొందారు?. 2.ఈ ఘటనపై దర్యాప్తు ఎంతవరకు వచ్చింది? ఏం చర్యలు తీసుకున్నారు?. 3.నాటి ఘటనకు భద్రతావైఫల్యమే కారణమంటూ బీజేపీ ప్రభుత్వంలోని ఏ ఒక్కరూ ఎందుకు బాధ్యత వహించడం లేదు?’ అంటూ ప్రశ్నించారు. ఈ ఘటనపై దర్యాప్తు నివేదికను ప్రజలకు ఎందుకు వివరించడం లేదని నిలదీశారు. సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరీ సైతం పుల్వామా దాడి నివేదికను బహిర్గతం చేయాలని డిమాండ్‌ చేశారు. మరోవైపు దేశమంతా అమరులకు నివాళులు అర్పిస్తుంటే.. రాహుల్‌మాత్రం కేంద్రంపై, భద్రతాబలగాలపై విమర్శలు గుప్పిస్తున్నారని బీజేపీ మండిపడింది.


‘పుల్వామా’ స్మారకం


పుల్వామా ఘటనలో అమరులైన జవాన్లకు నివాళిగా జమ్ముకశ్మీర్‌లోని పుల్వా మా జిల్లా లెథ్‌పొరా వద్ద ఉన్న సీఆర్పీఎఫ్‌ క్యాంప్‌లో స్మారకాన్ని ఏర్పాటు చేశారు. దాడిలో ప్రాణాలు కోల్పోయిన 40 మంది సైనికుల ఫొటోలను, వారి పేర్లను ఈ స్మారకంపై పొందుపరిచారు. దీనిని శుక్రవారం ప్రారంభించారు. మహారాష్ట్రకు చెందిన ఉమేశ్‌ గోపీనాథ్‌ అనే వ్యక్తి దాదాపు 61వేల కిలోమీటర్లు ప్రయాణం చేసి 40 మంది అమర జవాన్ల కుటుంబాలను కలిశారు. వారి ఇండ్ల నుంచి మట్టిని సేకరించి శుక్రవారం లెథ్‌పొరా క్యాంప్‌ వద్ద సీఆర్పీఎఫ్‌ అధికారులకు అప్పగించారు.


logo