సోమవారం 06 ఏప్రిల్ 2020
National - Mar 04, 2020 , 02:09:01

పుల్వామా ఉగ్రదాడి తండ్రీకూతుళ్ల అరెస్ట్‌

పుల్వామా ఉగ్రదాడి తండ్రీకూతుళ్ల అరెస్ట్‌
  • పుల్వామా జిల్లాలోని హక్రిపొరాలో అదుపులోకి తీసుకొన్న ఎన్‌ఐఏ
  • ఉగ్రవాదులకు ఆశ్రయం కల్పించినట్టు వెల్లడి

శ్రీనగర్‌: పుల్వామా ఉగ్రదాడి దర్యాప్తులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్‌ఐఏ) కీలక ముందడుగు వేసింది. ఈ దాడి ఘటనతో సంబంధమున్న తండ్రీకూతుళ్లను అరెస్ట్‌ చేసింది. జమ్ముకశ్మీర్‌లోని పుల్వామాలో గత ఏడాది ఫిబ్రవరి 14న జరిగిన ఉగ్రదాడిలో 40 మంది సీఆర్పీఎఫ్‌ జవాన్లు దుర్మరణం పాలయ్యారు. ఈ కేసును దర్యాప్తు చేస్తున్న ఎన్‌ఐఏ.. తాజాగా పుల్వామా జిల్లాలోని హక్రిపొరా గ్రామానికి చెందిన తారిక్‌ అహ్మద్‌షా, ఆయన కూతురు ఇన్షాజాన్‌ (23)ను అదుపులోకి తీసుకొంది. సీఆర్పీఎఫ్‌ కాన్వాయ్‌పై ఆత్మాహుతి దాడికి పాల్పడిన జైషే మహ్మద్‌ ఉగ్రవాది ఆదిల్‌ మహ్మద్‌ దార్‌.. ఇదే తారిక్‌ అహ్మద్‌షా నివాసం వద్ద దాడికి ముందు ఒక వీడియోను షూట్‌ చేశారు. దాడి అనంతరం ఈ వీడియోను పాకిస్థాన్‌ విడుదల చేసింది. ట్రక్‌ డ్రైవర్‌ అయిన తారిక్‌ అహ్మద్‌షా.. తన ఇంటిని పాక్‌ ఉగ్రవాది దార్‌, మహ్మద్‌ ఉమర్‌ ఫారుఖ్‌, ఐఈడీ తయారీ నిపుణుడు కమ్రాన్‌, మరో ఉగ్రవాది (ఇద్దరూ తర్వాత ఎన్‌కౌంటర్‌లో హతమయ్యారు), పుల్వామాకు చెందిన జైష్‌ ఉగ్రవాది సమీర్‌ అహ్మద్‌ దార్‌, పాక్‌కు చెందిన ఉగ్రవాది ఇస్మాయిల్‌ అలియాస్‌ ఇబ్రహీం తదితరులకు ఆశ్రయం కల్పించాడు. తారిక్‌ కూతురు ఉగ్రవాదులకు ఆహారం, ఇతర సౌకర్యాలు సమకూర్చినట్టు గుర్తించారు.


logo