బుధవారం 12 ఆగస్టు 2020
National - Jul 20, 2020 , 21:00:14

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదం లేకుండానే బడ్జెట్‌ సమర్పణ

లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఆమోదం లేకుండానే బడ్జెట్‌ సమర్పణ

చెన్నై: పుదుచ్చేరిలో లెఫ్టినెంట్‌ గవర్నర్‌, ముఖ్యమంత్రి మధ్య ఇంకా ఘర్షణ వాతావరణం కొనసాగుతున్నది. ఇందుకు తాజా నిదర్శనంగా బడ్జెట్‌ సమావేశాలను చెప్పుకోవచ్చు. లెఫ్టినెంట్ గవర్నర్ కిరణ్ బేడి ఆమోదం లేకుండానే, అలాగే ఆమె ప్రసంగం లేకుండానే ముఖ్యమంత్రి నారాయణస్వామి 2020-21 బడ్జెట్‌ సమర్పించారు. ఆర్థికశాఖ మంత్రిగా కూడా విధులు నిర్వర్తిస్తున్న నారాయణస్వామి.. సోమవారం రూ.9,000 కోట్ల బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా దివంగత ముఖ్యమంత్రి, డీఎంకే అధ్యక్షుడు ఎం కరుణానిధి పేరిట ప్రభుత్వ పాఠశాలల్లోని పేద విద్యార్థులకు ఉచిత అల్పాహారం పథకాన్ని ప్రకటించారు. ఈ పథకం నవంబర్‌లో ప్రారంభమవుతుందని ఆయన చెప్పారు. అలాగే, దారిద్య్రరేఖకు దిగువన ఉన్నవారికి 100 యూనిట్ల ఉచిత విద్యుత్తును కూడా ప్రకటించారు.

“కేంద్ర పాలిత ప్రాంతం చట్టం,  వ్యాపార నిబంధనల ప్రకారం లెఫ్టినెంట్‌ జనరల్‌ పరిపాలనా ఆమోదం కోసం వార్షిక బడ్జెట్ ఫైల్ ఇంకా ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి విడుదల కాలేదు. ఇది సీఎం కార్యాలయం వల్ల తీవ్రమైన ఆర్థిక సంక్షోభానికి దారితీస్తుంది. పుదుచ్చేరి యొక్క ప్రజలు ఈ విషయాన్ని గుర్తించాలి " అని ట్విట్టర్లో కిరణ్‌ బేడీ పోస్ట్‌ చేశారు.

తన తండ్రి పేరిట ఉచిత అల్పాహారం పథకం ప్రవేశపెట్టడంపై నారాయణసామి ఇప్పుడు కోట్ల మంది డీఎంకే కార్యకర్తల హృదయాలను గెలుచుకున్నారు అని స్టాలిన్ అన్నారు.


logo