బుధవారం 03 జూన్ 2020
National - May 07, 2020 , 01:16:18

త్వరలో రోడ్లపైకి బస్సులు

త్వరలో రోడ్లపైకి బస్సులు

  • ప్రజా రవాణా పునరుద్ధరణ
  • కేంద్ర మంత్రి గడ్కరీ వెల్లడి

న్యూఢిల్లీ, మే 6: దేశంలో త్వరలోనే ప్రజా రవాణా సేవలు ప్రారంభమయ్యే అవకాశాలు ఉన్నాయని కేంద్ర రోడ్డు రవాణా, రహదారుల శాఖ మంత్రి నితిన్‌ గడ్కరీ బుధవారం వెల్లడించారు. ఇదే సమయంలో ప్రజలందరూ నిర్ణీత దూరాన్ని పాటించడం వంటి చర్యల్ని తీసుకునేలా ప్రభుత్వం మార్గదర్శకాల్ని రూపొందిస్తున్నదని వివరించారు. దేశంలోని బస్సులు, కార్ల ఆపరేటర్ల సమాఖ్య ప్రతినిధులతో బుధవారం జరిగిన వీడియో కాన్ఫరెన్స్‌లో గడ్కరీ మాట్లాడారు. ప్రజా రవాణాను ప్రారంభిస్తే ప్రజల్లో ఉత్సాహం వస్తుందని, రవాణా సేవలను, హైవేలను త్వరలోనే తెరుస్తామని అన్నారు. కరోనా వల్ల కుదేలైన రవాణా రంగానికి బెయిలవుట్‌ ప్రకటించాలని ఈ సందర్భంగా ప్రతినిధులు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేయగా ఆదుకుంటామని గడ్కరీ చెప్పారు. కరోనా సంక్షోభాన్ని ఒక అవకాశంగా మలుచుకొని ప్రపంచ దేశాల పెట్టుబడులను ఆకర్షించాలని పరిశ్రమ ప్రతినిధులకు, పెట్టుబడిదారులకు పిలుపునిచ్చారు. 

లండన్‌ మోడల్‌ను పరిశీలిస్తున్నాం!

ప్రభుత్వ పెట్టుబడులు తక్కువగా, ప్రైవేటు పెట్టుబడులు అధికంగా ఉన్న లండన్‌ ప్రజా రవాణా వ్యవస్థ విధానాన్ని దేశంలో అమలు చేయడానికి చూస్తున్నామని గడ్కరీ తెలిపారు. 5 -7 ఏండ్లకు మించి దేశంలోని బస్సులు, లారీలు నడువడంలేదని, ఐరోపా దేశాల్లో వాటి మన్నిక వ్యవధి దాదాపు 15 ఏండ్లుగా ఉన్నదన్నారు. ఈ క్రమంలో అక్కడి విధానాల్ని అనుసరించేందుకు ప్రయత్నాస్తామన్నారు.logo