రైతులపై హత్య, అల్లర్ల కేసులు

అంబాలా : కేంద్రం తీసుకువచ్చి వ్యవసాయ బిల్లులను వ్యతిరేకిస్తూ రైతులు చేపట్టిన ‘ఢిల్లీ చలో’ మార్చ్ కొనసాగుతోంది. ఈ సందర్భంగా భారతీయ కిసాన్ యూనియన్ (బీకేయూ) చీఫ్ గుర్నామ్ సింగ్ చారునితో పాటు పలువురు రైతులపై అధికారులు హత్య, అల్లర్లు, విధులకు ఆటంకం కల్పించారంటూ పోలీసులు శనివారం కేసులు నమోదు చేశారు. పరావో పోలీస్ స్టేషన్ హెడ్ కానిస్టేబుల్ పర్దీప్ కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బీకేయూ హర్యానా చీఫ్, పలువురు రైతులు అంబాలాలోని మోహ్రా గ్రామం సమీపంలో ఢిల్లీకి వెళ్లేందుకు యత్నించారు. వారిని డిప్యూటీ సూపరింటెండెంట్ రామ్‌కుమార్ అడ్డుకొని, ముందుకు వెళ్లొద్దని సూచించినా.. చారుని నిరాకరిస్తూ ట్రాక్టర్లతో పోలీసులు బారికేడ్లను తొలగించి, ఢిల్లీ వైపు వెళ్లినట్లు ఎఫ్ఐఆర్లో పేర్కొన్నారు. చారునితో పాటు ఇతర రైతులు కొవిడ్ మార్గదర్శకాలను ఉల్లంఘించారని తెలిపారు. అలాగే పోలీసులు ఏర్పాటు చేసిన బారికేడ్లను తొలగించడం, నిబంధనలు ఉల్లంఘించినందుకు కేసులు నమోదు చేశారు. సెక్షన్ 307 (హత్యాహత్నం), 147 (అల్లర్లు), 149 (చట్టవ్యతిరేకంగా గుమిగూడడం), 2005 ఐపీసీ కింద పలు కేసులు నమోదు చేశారు.