గురువారం 21 జనవరి 2021
National - Dec 19, 2020 , 23:48:31

ఆందోళనతో ఏ పార్టీకి సంబంధం లేదు: రైతు సంఘాలు

ఆందోళనతో ఏ పార్టీకి సంబంధం లేదు: రైతు సంఘాలు

న్యూఢిల్లీ: కేంద్ర వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని కోరుతూ తాము చేపట్టిన ఆందోళనతో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదని అఖిలభారత కిసాన్‌ సంఘర్ష్‌ కోఆర్డినేషన్‌ కమిటీ (ఏఐకేఎస్‌సీసీ) స్పష్టం చేసింది. ఈ మేరకు కమిటీ నేతలు శనివారం ప్రధాని నరేంద్రమోదీ, కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌లకు లేఖలు రాశారు. మోదీ, తోమర్‌లకు హీందీలో వేర్వేరుగా లేఖలు రాశారు. విపక్షాల సహకారంతోనే రైతులు ఆందోళన చేస్తున్నారని కేంద్రం తప్పుడు నిర్ధారణకు వచ్చిందని పేర్కొన్నారు. 

మూడు కేంద్ర వ్యవసాయ చట్టాలపై రైతులను విపక్షాలు తప్పుదోవ పట్టిస్తున్నాయని ప్రధాని మోదీ ఆరోపించిన మరునాడే ఏఐకేఎస్‌సీసీ ఆయనకు లేఖ రాయడం గమనార్హం. మధ్యప్రదేశ్‌లో జరిగిన ఒక సభలో నరేంద్రమోదీ మాట్లాడుతూ ప్రజల మద్దతు కోల్పోయిన పార్టీలే కేంద్ర వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులతో బలవంతంగా ఆందోళనకు పురిగొల్పాయని ఆరోపించారు. 

ఈ నేపథ్యంలో ఆందోళనలో పాల్గొంటున్న 40 రైతు సంఘాల తరఫున ఏఐకేఎస్‌సీసీ లేఖ రాస్తూ.. ఢిల్లీ సరిహద్దుల్లో బైఠాయించిన రైతుల్లో ఏ ఒక్కరూ గానీ, సంఘాలు గానీ రాజకీయ పార్టీలకు అనుబంధం కాదని స్పష్టం చేసింది. మరోవైపు సమస్య పరిష్కారానికి జరిగే చర్చల్లో కేంద్ర మంత్రి నరేంద్ర సింగ్‌ తోమర్‌ ప్రధాన డిమాండ్ల నుంచి తప్పుదోవ పట్టించడానికి ప్రయత్నిస్తున్నారని ఆరోపించింది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo