శుక్రవారం 05 జూన్ 2020
National - Feb 01, 2020 , 02:59:13

సిగ్గు సిగ్గు సీఏఏపై ప్రతిపక్షాల ధ్వజం

సిగ్గు సిగ్గు సీఏఏపై ప్రతిపక్షాల ధ్వజం
  • రాష్ట్రపతి ప్రసంగంపై నిరసన.. చేతులకు నల్లని బ్యాండ్లతో ధర్నా
  • నిరసనలో పాల్గొన్న 14 పార్టీలకు చెందిన నేతలు

న్యూఢిల్లీ: పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల నేపథ్యంలో 14 విపక్ష పార్టీలు నిరసనలకు దిగాయి. ఉభయ సభలనుద్దేశించి రాష్ర్టపతి రావ్‌ునాథ్ కోవింద్ ప్రసంగం చేస్తున్న సమయంలో చేతులకు నల్లని బ్యాండులను ధరించి  పలువురు విపక్ష నేతలు నిరసన తెలిపారు. సీఏఏ, ఎన్నార్సీ(జాతీయ పౌర జాబితా), ఎన్పీఆర్(జాతీయ జనాభా పట్టిక)ను వ్యతిరేకిస్తూ సిగ్గు సిగ్గు అంటూ నినాదాలు చేశారు. రాష్ట్రపతి ప్రసంగిస్తున్న సమయంలో రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు గులాంనబీ ఆజాద్, కాంగ్రెస్ తాత్కాలిక అధ్యక్షురాలు సోనియా గాంధీ తమకు కేటాయించిన మొదటి రెండు వరుసల్లోని స్థానాల్లో కూర్చోకుండా, మరో బ్లాక్‌లో కూర్చొని నిరసన వ్యక్తం చేశారు. నిరసనలు తెలిపిన పార్టీల్లో కాంగ్రెస్‌తో పాటు నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ    (ఎన్సీపీ), సమాజ్‌వాదీ పార్టీ(ఎస్పీ), డీఎంకే, రాష్ట్రీయ జనతా దళ్(ఆర్జేడీ), సీపీఎం, సీపీఐ, శివసేన, జార్ఖండ్ ముక్తి మోర్చా జనతా దళ్(సెక్యులర్), రివల్యూషనరీ సోషలిస్టు పార్టీ(ఆర్‌ఎస్పీ), కేరళ కాంగ్రెస్(ఎం), ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్(ఐయూఎంఎల్), నేషనల్ కాన్ఫరెన్స్(ఎన్సీ) ఉన్నాయి.


కీలకాంశాల ప్రస్తావనే లేదు

రాష్ర్టపతి ప్రసంగంలో ప్రభుత్వం సీఏఏను చేర్చి, అదో గొప్ప విజయంగా పేర్కొనడం దురదృష్టకరం. సీఏఏ ఒక విజయం అని చెప్పుకుంటున్న ప్రభుత్వానికి ఇంతకంటే మరో పెద్ద సిగ్గుమాలిన చర్య ఉండబోదు. కేంద్ర క్యాబినెట్ రాసిచ్చిన ప్రసంగాన్ని రాష్ర్టపతి చదివారు అని కాంగ్రెస్ నేత ఆజాద్ మండిపడ్డారు. రాష్ర్టపతి ప్రసంగంలో నిరుద్యోగ సమస్య, జీడీపీ, ధరల పెరుగుదల వంటి కీలక అంశాల ప్రస్తావన లేదన్నారు. జమ్ముకశ్మీర్ కేంద్రపాలిత ప్రాంతంగా మారిన తర్వాత అక్కడ ఎంతో అభివృద్ధి జరిగిందని కేంద్రం అబద్ధాలు చెబుతోందని విరుచుకుపడ్డారు. ఇలాంటి క్రూరమైన హాస్యానికి తెరతీసిన ప్రభుత్వం అక్కడి ప్రజలకు, జాతికి క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేశారు. సీఏఏను విజయంగా చెప్పుకుంటున్న ప్రభుత్వం రాజ్యాంగంపై దాడి చేసిందని కాంగ్రెస్ మరోనేత ఆనంద్ శర్మ పేర్కొన్నారు. దేశంలో అంతర్యుద్ధం పరిస్థితులు నెలకొనే దిశగా ప్రస్తుత సమాజం పయనిస్తున్నదని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి ఆందోళన వ్యక్తం చేశారు. 


logo