బుధవారం 02 డిసెంబర్ 2020
National - Nov 07, 2020 , 02:29:29

సాక్షులకు రక్షణ కల్పించండి

సాక్షులకు రక్షణ కల్పించండి

  • చట్టసభ సభ్యులపై కేసులకు సంబంధించి  ట్రయల్‌ కోర్టులకు సుప్రీంకోర్టు ఆదేశం
  • కేసులను అనవసరంగా వాయిదా వేయొద్దని సూచన

న్యూఢిల్లీ, నవంబర్‌ 6: ప్రస్తుత, మాజీ చట్టసభ సభ్యులపై (ఎంపీలు, ఎమ్మెల్యేలు) నమోదైన కేసులకు సంబంధించి సుప్రీంకోర్టు కీలక ఆదేశాలు జారీచేసింది. సాక్షుల భద్రత పథకం-2018 కింద ఈ కేసుల్లో సాక్షులకు రక్షణ కల్పించే అంశాన్ని ట్రయల్‌ కోర్టులు పరిశీలించాలని సూచించింది. ఇలాంటి కేసుల్లో సాక్షులకున్న ముప్పు దృష్ట్యా వారి నుంచి ప్రత్యేకంగా అభ్యర్థన రాకపోయినప్పటికీ రక్షణ కల్పించే అంశాన్ని పరిశీలించవచ్చని పేర్కొంది. సాక్షుల భద్రతా స్కీమ్‌ను అన్ని రాష్ర్టాలు కఠినంగా అమలు చేయాలని జస్టిస్‌ ఎన్వీ రమణ, జస్టిస్‌ సూర్య కాంత్‌, జస్టిస్‌ అనిరుధ బోస్‌లతో కూడిన ధర్మాసనం ఆదేశించింది. వాంగ్మూలం ఇచ్చేందుకు చాలా మంది సాక్షులు కోర్టులకు రావడానికి ఇష్టపడటంలేదని ధర్మాసనం పేర్కొంది. ప్రజా ప్రయోజనాల దృష్ట్యా, ఈ కేసుల్లో అనవసర వాయిదాలు వేయొద్దని స్పష్టంచేసింది. ప్రత్యేక దర్యాప్తు బృందాలు విచారణ చేపడుతున్న చట్టసభ సభ్యుల కేసుల వివరాలను సమర్పించేందుకు సొలిసిటర్‌ జనరల్‌కు కోర్టు మరో వారం గడువిచ్చింది. ఎంపీలు, ఎమ్మెల్యేలపై దాఖలైన కేసులను త్వరగా పరిష్కరించాలని కోరుతూ బీజేపీ నేత, న్యాయవాది అశ్వినీ ఉపాధ్యాయ్‌ దాఖలు చేసిన ప్రజాప్రయోజన వ్యాజ్యంపై కోర్టు శుక్రవారం విచారణ కొనసాగించింది.