ఆదివారం 12 జూలై 2020
National - Jun 15, 2020 , 13:09:34

విశాఖ‌లో రెచ్చిపోతున్న వ్య‌భిచార ముఠాలు

విశాఖ‌లో రెచ్చిపోతున్న వ్య‌భిచార ముఠాలు

అమ‌రావ‌తి: విశాఖప‌ట్నంలో వ్యభిచార ముఠాలు రెచ్చిపోతున్నాయి. ఈ ముఠాలు గ్రామీణ యువతులే లక్ష్యంగా చేసుకొని వ్యభిచార కూపంలోకి దించుతున్నాయి. అమాయ‌క మహిళలను బుట్ట‌లో వేసుకుని వారి  జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఇటీవ‌లే ఒక యువ‌తి ఓ వ్య‌భిచార‌ ముఠా అరాచకానికి బ‌లైంది. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు మ‌రో యువ‌తి ఓ వ్య‌భిచార కూపం నుంచి బయటపడి పోలీసుల‌ను ఆశ్రయించింది. 

యువ‌తి ఫిర్యాదు మేర‌కు పోలీసులు ముగ్గురు మహిళా నిర్వాహకులు, ముఠాతో సంబంధాలున్న మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. కృష్ణా జిల్లా గుడివాడ ప్రాంతానికి చెందిన ఓ యువతి కొద్ది రోజుల క్రితం  ఇంటి నుంచి వెళ్లిపోయి ఒంటరిగా తిరుపతికి చేరింది. అక్కడ ఆమెను ట్రాప్ చేసిన వ్య‌భిచార ముఠా స‌భ్యులు ఫోన్ నంబర్ ఇచ్చి ఏదైనా సాయం కావాలంటే త‌మ‌ను అడుగొచ్చ‌ని సూచించారు. దీంతో వారి బుట్ట‌లోప‌డ్డ యువ‌తిని విశాఖపట్నం తీసుకెళ్లి వ్య‌భిచారం రొంపిలోకి దించారు. 

కాగా, నర్సీపట్నానికి చెందిన ఓ వ్యక్తి త‌న‌ను పెళ్లి చేసుకుంటానని చెప్పి సహజీవనంచేసి మోసం చేశాడని,  వ్య‌భిచార‌ ముఠా తనను మాన‌సికంగా, శారీర‌కంగా చిత్ర‌వ‌ధ‌కు గురిచేసింద‌ని బాధిత యువతి తన గోడు వెళ్లబోసుకుంది. కేసు న‌మోదు చేసుకున్న పోలీసులు నిందితులను అరెస్టు చేసి రిమాండ్‌కు త‌ర‌లించారు.  బాధితురాలిని రెస్క్యూ హోంకు పంపించారు. 


logo