బుధవారం 05 ఆగస్టు 2020
National - Jul 21, 2020 , 20:27:49

మెడికల్‌ దుకాణాల్లో అందుబాటులో కరోనా మందు

మెడికల్‌ దుకాణాల్లో అందుబాటులో కరోనా మందు

హైదరాబాద్: హైదరాబాద్‌ సహా దేశవ్యాప్తంగా కొవిడ్-19 కేసుల పెరుగుదల కనిపిస్తున్నది. ఫలితంగా వైరల్ నిరోధక మందులు, స్టెరాయిడ్స్‌తో కూడిన పరిశోధనా చికిత్సల డిమాండ్‌కు ఆజ్యం పోసినట్లయింది. రోగులపై ఇటువంటి ఔషధాల భద్రత, సమర్థత ఇంకా శాస్త్రీయంగా నిరూపించబడలేదు. ఇంకా క్లినికల్ ట్రయల్స్ దశలోనే ఉన్నాయి. అయితే రోగుల భయాన్ని సొమ్ము చేసుకునే బ్లాక్‌మెయిలర్స్‌ ఇప్పటికే రంగంలోకి దిగడంతో.. రాష్ట్రంలోని అన్ని మెడికల్‌ షాపుల్లో కరోనా మందు అందుబాటులో ఉండేలా ప్రభుత్వమే తగు చర్యలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు.

కొవిడ్-19 రోగుల చికిత్స కోసం డ్రగ్ కంట్రోలర్ జనరల్ ఆఫ్ ఇండియా (డీసీజీఐ), న్యూఢిల్లీలోని ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వశాఖ ఆమోదించిన అన్ని ప్రధాన ఔషధాల కొరత తక్కువగా ఉంది. ఇప్పటికే ఉన్న స్టాక్‌లను నిల్వ చేసి బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నట్లుగా తెలుస్తున్నది. యాంటీవైరల్ ఔషధాలను విక్రయిస్తున్న వారిని తెలంగాణ స్టేట్ డ్రగ్ కంట్రోల్ అడ్మినిస్ట్రేషన్ (డీసీఏ) డ్రగ్ ఇన్స్పెక్టర్ల సమన్వయంతో పోలీసులు అరెస్టు చేసిన నేపథ్యంలో.. హైదరాబాద్‌లో రెమ్డెసివిర్‌పై చాలా మంది దృష్టి పెట్టినట్లు తెలుస్తున్నది. అరెస్టయిన వారు మాదకద్రవ్యాలను పెద్ద మొత్తంలో నిల్వ చేసి బ్లాక్ మార్కెట్లో అధిక ధరలకు విక్రయిస్తున్నట్టుగా పోలీసులు గుర్తించారు.

ప్రభుత్వం జోక్యం అవసరం 

ప్రాణాలను రక్షించే ఔషధాలన్నీ ప్రజలకు ఎమ్మార్పీ ధరలకే లభించేలా చూసేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నేరుగా జోక్యం.చేసుకోవాలని నిపుణులు కోరుతున్నారు. 'రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాలు ఈ ఔషధాలను తయారీదారుల నుంచి నేరుగా సేకరించి ప్రజలకు అందజేయడం ద్వారా మధ్యవర్తుల పాత్రను తొలగించవచ్చు. ప్రజలు, ప్రైవేట్ హెల్త్‌కేర్ సంస్థలు ఇటువంటి మందులను నేరుగా ప్రభుత్వ యాజమాన్యంలోని ఫార్మసీల నుంచి సరసమైన ధరలకే కొనుగోలు చేయవచ్చు' అని హైదరాబాద్‌లోని బల్క్ డ్రగ్ తయారీదారుల సంఘం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ డాక్టర్ పీ ఈశ్వర్ రెడ్డి సూచిస్తున్నారు.


logo