బుధవారం 20 జనవరి 2021
National - Nov 24, 2020 , 17:26:34

మాకు వాళ్లు హిందూ-ముస్లింలు కారు

మాకు వాళ్లు హిందూ-ముస్లింలు కారు

హైద‌రాబాద్‌:  అల‌హాబాద్ హైకోర్టు ఇవాళ సంచ‌ల‌న తీర్పును వెలువ‌రించింది.  కుషీన‌గ‌ర్‌లో జ‌రిగిన ఓ మ‌తాంత‌ర వివాహం కేసులో తీర్పును ఇచ్చిన అల‌హాబాద్ కోర్టు.. పెళ్లి చేసుకున్న జంట‌ను హిందూ-ముస్లింగా చూడ‌డం లేద‌ని కోర్టు చెప్పింది.  హిందూ మ‌తానికి చెందిన‌ ప్రియాంకా ఖార్‌వార్‌.. ఇస్లామిక్ మ‌తానికి చెందిన స‌లామ‌త్ అన్సారీలు ఏడాది క్రితం పెళ్లి చేసుకున్నారు. అయితే బ‌ల‌వంతంగా మ‌త‌మార్పిడి ద్వారా పెళ్లి చేసుకున్న‌ట్లు ప్రియాంకా తండ్రి కోర్టులో కేసు దాఖ‌లు చేశారు.  ఈ కేసును ప‌రిశీలించిన అల‌హాబాద్ హైకోర్టు.. ముస్లిం వ్య‌క్తిపై అమ్మాయి తండ్రి న‌మోదు చేసిన ఫిర్యాదును ర‌ద్దు చేసింది.  స‌లామ‌త్ అన్సారీని పెళ్లి చేసుకున్న త‌ర్వాత అమ్మాయి ఇస్లాం మ‌తాన్ని స్వీక‌రించినట్లు కోర్టు త‌న తీర్పులో పేర్కొన్న‌ది.  ఇద్ద‌రు వ్య‌క్తుల బంధంలో జోక్యం చేసుకోవ‌డం వ్య‌క్తి స్వేచ్ఛ‌ను హ‌రించ‌డ‌మే అవుతుంద‌ని కోర్టు వెల్ల‌డించింది.  

ప్రియాంకా, అన్సారీల‌ను హిందూ ముస్లింగా చూడ‌డం లేద‌ని,  వారిద్దర్నీ ప‌రిణితి చెందిన వ్య‌క్తులుగా గుర్తిస్తున్నామ‌ని, వారి స్వేచ్ఛ‌కు త‌గిన‌ట్లు.. సంతోషంగా గ‌త ఏడాది నుంచి జీవితం కొన‌సాగిస్తున్నార‌ని, రాజ్యాంగంలోని ఆర్టిక‌ల్ 21 ప్ర‌కారం వ్య‌క్తి త‌న స్వేచ్ఛ‌ను ఎంజాయ్ చేసే విధంగా కోర్టులు చూస్తాయ‌ని ఇద్ద‌రు స‌భ్యుల ధ‌ర్మాస‌నం త‌న తీర్పులో పేర్కొన్న‌ది. కుషీన‌గ‌ర్‌కు చెందిన స‌లామ‌త్ ఆగ‌స్టు 2019లో ప్రియాంకా ఖ‌ర్‌వార్‌ను పెళ్లి చేసుకున్న‌ది. కానీ ప్రియాంకా పేరెంట్స్ ఆ పెళ్లిని వ్య‌తిరేకించారు. త‌న పేరును ఆలియాగా మార్చుకున్న ప్రియాంకా ఆ త‌ర్వాత పెళ్లి చేసుకున్న‌ట్లు ఆరోప‌ణ‌లు ఉన్నాయి.  

త‌మ వివాహ బంధాన్ని తెంచేందుకు త‌మ‌పై ఫిర్యాదు చేసిన‌ట్లు న‌వ దంప‌తులు  కోర్టుకు తెలిపారు. పెళ్లి స‌మ‌యానికి అమ్మాయి మేజ‌ర్ అని అల‌హాబాద్ కోర్టు కూడా తేల్చింది. జ‌స్టిస్ పంక‌జ్ న‌ఖ్వీ, వివేక్ అగ‌ర్వాల్‌తో కూడిన ధ‌ర్మాస‌నం ఈ కేసులో తీర్పునిచ్చింది. ల‌వ్ జిహాద్‌పై దేశ‌వ్యాప్తంగా చ‌ర్చ జ‌రుగుతున్న త‌రుణంలో ఈ త‌ర‌హా తీర్పు రావ‌డం సంచ‌ల‌నంగా మారింది.  ల‌వ్ జిహాదీ కేసుల‌ను ఎదుర్కొనేందుకు కొన్ని రాష్ట్రాలు క‌ఠిన చ‌ట్టాల‌ను కూడా రూపొందిస్తున్న‌ట్లు పేర్కొన్నాయి.  logo