బుధవారం 27 జనవరి 2021
National - Jan 14, 2021 , 02:35:40

‘టెలి సిగ్నల్‌' వేవ్‌..

‘టెలి సిగ్నల్‌' వేవ్‌..

  • వాట్సాప్‌ను దెబ్బతీసిన ప్రైవసీ పాలసీ నిర్ణయం
  • పోటీ యాప్‌లకు పోటెత్తుతున్న యూజర్లు
  • టెలిగ్రామ్‌కు 72 గంటల్లో 2.5 కోట్ల డౌన్‌లోడ్లు
  • 4200 శాతం పెరిగిన ‘సిగ్నల్‌' యూజర్లు

వినియోగదారుల నమ్మకం, వారికి ఆమోదయోగ్యమయ్యే సేవలను అందించడంలోనే ఏ సంస్థ విజయ రహస్యమైనా దాగి ఉంటుంది. యూజర్లకు అత్యాధునిక మెసేజింగ్‌ ఫీచర్లను అందిస్తూ దశాబ్దకాలంగా ఇన్‌స్టంట్‌ మెసేజింగ్‌ యాప్‌లకు రారాజుగా వెలుగొందిన వాట్సాప్‌ సంస్థ ఏకపక్షంగా తీసుకున్న ‘ప్రైవసీ పాలసీ(గోప్యతా విధానం)’ నిర్ణయం ఆ సంస్థకు ప్రతికూలంగా మారుతున్నది. ఇదే సమయంలో పరిస్థితిని అనుకూలంగా మార్చుకున్న టెలిగ్రామ్‌, సిగ్నల్‌ యాప్‌లు.. కోట్లాది డౌన్‌లోడ్లతో దూసుకుపోతున్నాయి. 

నిమిషానికి  5,800 డౌన్‌లోడ్లు

వాట్సాప్‌ తాజా నిర్ణయంతో ఆ యాప్‌ వినియోగదారులు ప్రత్యామ్నాయ యాప్‌లకు మళ్లుతున్నారు. ముఖ్యంగా టెలిగ్రామ్‌, సిగ్నల్‌ యాప్‌ల వైపునకు మొగ్గు చూపుతున్నారు. గత కొన్ని రోజులుగా ఆయా యాప్‌ల డౌన్‌లోడ్లు విపరీతంగా పెరిగిపోవడమే దీనికి రుజువు. గత 72 గంటల్లో (మూడు రోజుల్లో) కొత్తగా 2.5 కోట్ల మంది తమ టెలిగ్రామ్‌ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్టు ఆ సంస్థ వ్యవస్థాపకుడు పావెల్‌ దురోవ్‌ మంగళవారం పేర్కొన్నారు. ఆసియా నుంచి 38 శాతం, ఐరోపా నుంచి 27 శాతం, లాటిన్‌ అమెరికా నుంచి 21 శాతం, మధ్య ప్రాచ్యం-ఆఫ్రికా దేశాల నుంచి 8 శాతం కొత్త వినియోగదారులు తమ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నట్టు సంస్థ ప్రకటించింది. దీంతో ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్‌ను వినియోగిస్తున్న యూజర్ల సంఖ్య 50 కోట్లు దాటింది. మరో మెసేజింగ్‌ యాప్‌ ‘సిగ్నల్‌' కూడా డౌన్‌లోడ్లతో దూసుకుపోతున్నది. గతేడాది డిసెంబర్‌ చివరినాటికి ప్రపంచవ్యాప్తంగా ఈ యాప్‌నకు 2 కోట్ల మంది యూజర్లు ఉండగా.. ప్రస్తుతం ఈ సంఖ్య 3 కోట్లకు చేరువైంది. జనవరి 6 నుంచి 10వ తేదీ మధ్యలోనే ఏకంగా 75 లక్షల మంది (భారత్‌లో 23 లక్షల మంది) ఈ యాప్‌ను డౌన్‌లోడ్‌ చేసుకున్నారు. గతేడాది డౌన్‌లోడ్‌లతో పోలీస్తే ఇది 4,200 శాతం ఎక్కువ. రానున్న కాలంలో భారత్‌లో 20 కోట్ల మంది యూజర్లను చేజిక్కించుకోవడమే తమ లక్ష్యమని సిగ్నల్‌ వ్యవస్థాపకుడు బ్రియాన్‌ యాక్టన్‌ తెలిపారు. యాపిల్‌ యాప్‌ స్టోర్‌ ర్యాంకింగ్‌లో తమ యాప్‌ 40 దేశాల్లో ప్రథమ స్థానంలో ఉన్నదని, గూగుల్‌ ప్లే స్టోర్‌ ర్యాంకింగ్‌లో 18 దేశాల్లో అగ్ర స్థానంలో ఉన్నాదని  తెలిపారు. 

నష్టనివారణ చర్యల్లో వాట్సాప్‌

తాజా ప్రైవసీ పాలసీతో తన యూజర్లు ఇతర యాప్‌ల వైపునకు మొగ్గు చూపుతుండటంతో వాట్సాప్‌ నష్టనివారణ చర్యలను ప్రారంభించింది. బుధవారం పలు జాతీయ దిన పత్రికల మొదటి పేజీల్లో ప్రకటనలను ఇచ్చింది. కొత్త పాలసీ ప్రకారం.. బిజినెస్‌ ఖాతాలు ఉన్న వారి సమాచారాన్ని మాత్రమే తాము సేకరిస్తామని వెల్లడించింది. సాధారణ యూజర్ల గోప్యతను కాపాడటంలో కట్టుబడి ఉన్నట్టు ఆ ప్రకటనల్లో వివరించింది. 

 - నేషనల్‌ డెస్క్‌


logo