బుధవారం 03 జూన్ 2020
National - May 17, 2020 , 18:41:42

కొండెక్కిన కోడి కూర‌

కొండెక్కిన కోడి కూర‌

బెంగ‌ళూరు: కోడికూర‌ ధ‌ర కొండెక్కింది. క‌రోనా కార‌ణంగా ఫౌల్ట్రీ రైతులు కోళ్లను పెంచ‌క‌పోవ‌డంతో ఇప్పుడు కోడి మాంసానికి తీవ్ర కొర‌త ఏర్ప‌డింది. దీంతో చికెన్‌ ధ‌ర‌లకు రెక్క‌లొచ్చాయి. కిలో చికెన్ ధ‌ర డ్రెస్‌డ్ అయితే రూ.250, స్కిన్ లెస్ అయితే కిలో రూ.270 ప‌లుకుతున్న‌ది. దాదాపు దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఇదే ప‌రిస్థితి ఉన్న‌ది. రెండు నెల‌ల క్రితం ప‌రిస్థితి ఇందుకు పూర్తి భిన్నంగా ఉండేది. చికెన్ తింటే క‌రోనా వైర‌స్ సోకుతుంద‌న్న ప్ర‌చారం జోరుగా సాగ‌డంతో గ‌త మార్చి, ఏప్రిల్ నెల‌ల్లో జ‌నం కోడి మాంసం కొనేందుకు జంకారు. దీంతో డిమాండ్ ప‌డిపోయి చికెన్ ధ‌ర‌లు అమాంతం దిగొచ్చాయి. 

కిలో చికెన్ ధ‌ర ఏకంగా రూ.50, 60 స్థాయికి ప‌డిపోయింది. అయినా కోళ్లు మిగిలిపోవ‌డంతో ఆఖ‌రికి వంద రూపాయ‌ల‌కు కోడి చొప్పున అమ్మారు. ఆ త‌ర్వాత వంద‌కు రెండు కోళ్ల చొప్పున ఇచ్చారు. కొన్ని ప్రాంతాల్లో అయితే ఉచితంగా కోళ్ల‌ను పంచిపెట్టారు. ఇలాంటి ప‌రిస్థితుల్లో కోళ్ల‌ను పెంచితే న‌ష్ట‌పోవాల్సి వ‌స్తుంద‌ని చాలా మంది ఫౌల్ట్రీ రైతులు ఫారాల‌ను మూసివేశారు. ఈ నేప‌థ్యంలో ఇప్పుడు కోళ్ల‌కు కొర‌త ఏర్ప‌డి ధ‌ర‌ల‌కు రెక్క‌లొచ్చాయి. అయితే, చికెన్ ధ‌ర‌లు పెరగ‌డం కార‌ణంగా గిరాకీ ప‌డిపోయింద‌ని, అప్పుడు క‌రోనా కొంప‌ముంచితే, ఇప్పుడు అధిక ధ‌ర‌లు కొంప‌ముంచేలా ఉన్నాయ‌ని క‌ర్ణాట‌క‌లోని హుబ్లీకి చెందిన చికెన్ వ్యాపారులు ఆవేద‌న వ్య‌క్తం చేస్తున్నారు.


logo