శనివారం 26 సెప్టెంబర్ 2020
National - Aug 15, 2020 , 07:36:04

రాజ్‌ఘాట్‌లో మహాత్మునికి నివాళులర్పించిన ప్రధాని

రాజ్‌ఘాట్‌లో మహాత్మునికి నివాళులర్పించిన ప్రధాని

ఢిల్లీ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో భాగంగా శనివారం ప్రధాని నరేంద్ర మోదీ  ఢిల్లీలోని రాజ్‌ఘాట్‌లో జాతిపిత మహాత్మా గాంధీకి ఘన నివాళులర్పించారు. ఇప్పటికే ఢిల్లీలో 74వ స్వాతంత్ర్య దినోత్సవానికి అధికారులు ఘనమైన ఏర్పాట్లు చేశారు. కాగా, స్వాతంత్య్ర వేడుకల్లో భాగంగా మొదట రాజ్‌ఘాట్‌లో మహాత్ముడికి నివాళులర్పించిన మోదీ అక్కడి నుంచి నేరుగా ఎర్రకోటకు చేరుకున్నారు.  అక్కడ కేంద్ర  రక్షణ  మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ స్వాగతం పలికారు. అనంతరం గాఢ్‌ ఆఫ్‌ హానర్‌లో భాగంగా భద్రతా బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం జాతీయ జెండా ఆవిష్కరించి, దేశ ప్రజలనుద్దేశించి మాట్లాడనున్నారు. మోదీ ఎర్రకోట నుంచి స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో ప్రసంగించడం ఇది వరుసగా ఏడోసారి. ఎర్రకోటలో పంద్రాగస్టు వేడుకలకు రక్షణ శాఖ, ఢిల్లీ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. వేడుకలకు అధికారులు, మీడియా ప్రతినిధులు సహా 4వేల మందికి పైగా ఆహ్వానం పంపినట్టు రక్షణ శాఖ వెల్లడించింది. కరోనా నేపథ్యంలో అందరూ భౌతిక దూరం పాటించేలా రక్షణశాఖ అధికారులు ఏర్పాట్లు చేశారు. ప్రతి ఒక్కరూ మాస్కు ధరించాలని కోరింది. ఉత్సవాల సమయంలో పలు చోట్ల హ్యాండ్‌ శానిటైజర్లను అందుబాటులో ఉంచుతామని తెలిపింది.


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo