గురువారం 03 డిసెంబర్ 2020
National - Aug 31, 2020 , 01:56:29

స్వదేశీ బొమ్మకు ప్రాణంపోద్దాం!

స్వదేశీ బొమ్మకు ప్రాణంపోద్దాం!

  • స్థానికంగానే ఆట బొమ్మల్ని తయారు చేయాలి
  • మన సంస్కృతికి అద్దంపట్టే యాప్స్‌ రూపొందించాలి
  • ఇందుకు యువ పారిశ్రామికవేత్తలు సిద్ధంకావాలి
  • ‘మన్‌కీ బాత్‌'లో ప్రధాని మోదీ ఉద్ఘాటన
  • ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌' దిశగా అడుగులు వేయాలని పిలుపు

న్యూఢిల్లీ, ఆగస్టు 30: చిన్నారులు ఆటలాడుకునే బొమ్మలను స్థానికంగానే తయారు చేయాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. రూ. 7 లక్షల కోట్ల విలువైన ప్రపంచ ఆట బొమ్మల తయారీ పరిశ్రమలో భారత్‌ వాటా చాలా తక్కువగా ఉన్నదని గుర్తు చేశారు. రకరకాల బొమ్మలను ఎంతో సృజనాత్మకంగా తయారు చేసే సామర్థ్యం భారతీయులకు ఉన్నదన్న ఆయన.. ‘టీమ్‌అప్‌ ఫర్‌ టాయ్స్‌' (బొమ్మలను తయారు చేసేందుకు సమాయత్తం కావడం) కోసం దేశీయ స్టార్టప్‌ సంస్థలు, యువ పారిశ్రామికవేత్తలు సిద్ధంగా ఉండాలన్నారు. ఆదివారం ‘మన్‌కీ బాత్‌' కార్యక్రమంలో జాతినుద్ధేశించి మోదీ ప్రసంగించారు. దేశ ప్రజలందరూ స్వదేశీ ఉత్పత్తులను ప్రోత్సహించాలన్నారు. పిల్లలు, పెద్దలు ఆడే కంప్యూటర్‌ గేమ్స్‌ను భారత సంస్కృతి, చరిత్రను ఆధారంగా చేసుకొని రూపొందించాలన్నారు. స్థానిక కళలు, కళాకారులను ప్రోత్సహిస్తూ ‘ఆత్మ నిర్భర్‌ భారత్‌' దిశగా అడుగులు వేయాలని చెప్పారు. కరోనా సంక్షోభంలో సరైన జాగ్రత్తలు పాటిస్తూ, ఎంతో నియమంగా ప్రజలు పండుగలను జరుపుకోవడాన్ని మోదీ కొనియాడారు. ప్రతి వేడుకను పర్యావరణహితంగా జరుపుకోవాలని ఈ సందర్భంగా పిలుపునిచ్చారు. ప్రస్తుతం జరుగుతున్న వినాయక ఉత్సవాల్లో భాగంగా ఊరూ, వాడల్లో పర్యావరణహిత మట్టి వినాయకులను ప్రతిష్ఠించడం తాను గమనించానని, ఇది ఆహ్వానించదగ్గ పరిణామమన్నారు. 

సాగుబాట పెరిగింది

కరోనా కష్టకాలంలోనూ రైతులు ఎంతో శ్రమిస్తూ వ్యవసాయాన్ని చేస్తున్నారని ప్రధాని మోదీ అన్నదాతలపై ప్రశంసలు కురిపించారు. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో గతేడాది కంటే ఏడు శాతం ఎక్కువ విస్తీర్ణంలో సాగుచేస్తున్నారని తెలిపారు. గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది గోధుమ 10 శాతం, పప్పుధాన్యాలు ఐదు శాతం, నూనె గింజలు 13 శాతం, పత్తి మూడు శాతం ఎక్కువగా పండించడం శుభ పరిణామమన్నారు. వచ్చేనెల 5వ తేదీన జరుపుకోనున్న ఉపాధ్యాయ దినోత్సవాన్ని ప్రస్తావించిన మోదీ.. కరోనా విషమ పరిస్థితుల్లో టీచర్లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారన్నారు. అయినప్పటికీ, వాటిని సమర్థవంతంగా అధిగమిస్తూ సాంకేతికతను వినియోగించుకొని విద్యార్థులకు విద్యా బోధన చేశారన్నారు. 

దేశీ శునకాలను పెంచుకోండి

దేశ భద్రతలో జాగిలాల సేవలను ప్రధాని మోదీ ప్రత్యేకంగా ప్రశంసించారు. 74వ స్వాతంత్య్ర వేడుకల్లో చీఫ్‌ ఆఫ్‌ ఆర్మీ స్టాఫ్‌ ‘కమెండేషన్‌ కార్డ్స్‌' అందుకున్న విదా, సోఫీ జాగిలాల సేవల్ని గుర్తు చేశారు.  కొత్తగా పెంపుడు శునకాలను పెంచుకోవాలనుకునేవారు దేశీ జాతి శునకాలకు ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. మరోవైపు, సెప్టెంబర్‌ నెలను ‘పోషకాహార మాసం’గా పాటించాలన్నారు.