సోమవారం 13 జూలై 2020
National - Jun 26, 2020 , 11:55:48

‘ఆత్మ నిర్భర్‌ ఉత్తరప్రదేశ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌’ను ప్రారంభించిన మోదీ

‘ఆత్మ నిర్భర్‌ ఉత్తరప్రదేశ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌’ను ప్రారంభించిన మోదీ

లక్నో: ఉత్తరప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా చేపట్టిన ‘ఆత్మ నిర్భర్‌ ఉత్తరప్రదేశ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌’ను ప్రధానమంత్రి నరేంద్ర మోదీ శుక్రవారం ప్రారంభించారు. సీఎం యోగి ఆధిత్యనాథ్‌ సమక్షంలో వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ఈ పథకానికి కాన్ని ఆయన ప్రారంభించారు. కరోనా నేపథ్యంలో పలు రాష్ట్రాల నుంచి సొంత గ్రామాలకు తిరిగి వచ్చిన వలస కార్మికులకు ఉపాధి కల్పించేందుకు గరీబ్‌ కల్యాణ్‌ రోజ్‌గార్‌ అభియాన్‌ను ప్రధాని మోదీ ఈ నెల 20న దేశవ్యాప్తంగా ఆరు రాష్ట్రాల్లోని 116 జిల్లాల్లో  వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా ప్రారంభించారు. పలు జిల్లాలకు చెందిన ఉపాధి కార్మికులనుద్దేశించి ఆయన మాట్లాడారు. 

ఈ పథకంలో భాగంగా ఉత్తరప్రదేశ్‌లోని 31 జిల్లాలకు చెందిన వలస కార్మికులకు 125 రోజులపాటు ఉపాధి కల్పిస్తారు. అలాగే ప్రభుత్వ శాఖలకు చెందిన 25 కేటగిరి పనుల కోసం 1.25 కోట్ల మందికి ఉద్యోగాలు కల్పిస్తారు. ఇందులో భాగంగా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి పథకం కింద రోజుకు 60 లక్షల మందికి పని కల్పిస్తారు. అలాగే 2.4 లక్షల పరిశ్రమలకు రూ.5,900 కోట్ల రుణాలు,  1.11 లక్షల చిన్న పరిశ్రమలను నెలకొల్పేందుకు రూ.3,226 కోట్ల నిధులను యూపీ ప్రభుత్వం అందించనున్నది. అలాగే విశ్వకర్మ శ్రామ్ సమ్మన్ యోజనకింద ఒక జిల్లాకు ఒక ఉత్పత్తి పథకం కింద 1.25 లక్షల మందికి ప్రైవేట్‌ నిర్మాణ కంపెనీల్లో నియామక పత్రాలతోపాటు 5 వేల మందికి సంబంధిత పరికరాలను అందజేస్తారు. 

logo