గురువారం 26 నవంబర్ 2020
National - Nov 05, 2020 , 23:09:24

కార్పొరేట్‌ పన్ను రేట్లు చాలా తక్కువ.. భారత్‌కు రండి : ప్ర‌ధాని మోదీ

కార్పొరేట్‌ పన్ను రేట్లు చాలా తక్కువ.. భారత్‌కు రండి : ప్ర‌ధాని మోదీ

న్యూఢిల్లీ : భారత్‌లో ఇతోధికంగా పెట్టుబడులు పెట్టాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ అంతర్జాతీయ పెట్టుబడిదారులకు పెలుపునిచ్చారు. దీర్ఘకాలిక లాభాలను సాధించేందుకు భారత్‌ అత్యుత్తమ ప్రాంతమని పునరుద్ఘాటించారు. గురువారం వర్చువల్‌ గ్లోబల్‌ ఇన్వెస్టర్‌ రౌండ్‌టేబుల్‌-2020 (వీజీఐఆర్‌-2020) సమావేశంలో ప్ర‌ధాని పాల్గొని ప్ర‌సంగించారు. ప్రపంచంలో అతితక్కువ కార్పొరేట్‌ పన్ను రేట్లున్న దేశాల్లో భారత్‌ ఒకటని గుర్తుచేశారు. ‘మీరు విశ్వసనీయతతో రాబడులను.. ప్రజాస్వామ్యంతో డిమాండ్‌ను, స్థిరత్వాన్ని.. సానుకూలమైన వృద్ధిని కాంక్షిస్తే అందుకు భారత్‌ తగిన స్థానం అన్నారు. ఉత్తమ ప్రజాస్వామ్యతో పాటు జనాభాను, డిమాండ్‌ను, వైవిధ్యాన్ని భారత్‌ అందిస్తున్నదన్నారు. ఒకే మార్కెట్లో మీరు బహుళ మార్కెట్లను పొందడమే భారత్‌ అందిస్తున్న వైవిధ్యం. భారత్‌ సాధిస్తున్న విజయాలు ప్రపంచ అభివృద్ధి, సంక్షేమంపై ఎన్నో రెట్ల ప్రభావాన్ని చూపుతాయి’ అని మోదీ స్పష్టం చేశారు. కొవిడ్‌-19 మహమ్మారితో పోరాడటం, ఆర్థిక స్థిరత్వాన్ని సాధించడంలో భారత్‌ గొప్ప పనితీరును కనబర్చిందన్నారు. భారత్‌ అనుసరిస్తున్న విధానాలతోపాటు ఇక్కడి వ్యవస్థల బలం, ప్రజల మద్దతుతోనే ఇది సాధ్యమైందని తెలిపారు. 

ఆత్మనిర్భర్‌ కేవలం విజన్‌ మాత్రమే కాదు..

ఆత్మనిర్భర్‌ భారత్‌ అనేది కేవలం విజన్‌ మాత్రమే కాదని, ప్రణాళికాబద్ధమైన ఆర్థిక వ్యూహమని మోదీ పేర్కొన్నారు. ‘భారత్‌ను ప్రపంచ ఉత్పాదక శక్తి కేంద్రంగా మార్చేందుకు, మా వ్యాపారాల సామర్థ్యాలను, కార్మికుల నైపుణ్యాలను ఉపయోగించడమే లక్ష్యంగా పెట్టుకున్న వ్యూహమే ఆత్మనిర్భర్‌ భారత్‌' అని స్పష్టం చేశారు. ప్రపంచంలోనే అతిపెద్ద పెట్టుబడిదారులైన సావరిన్‌ వెల్త్‌ ఫండ్స్‌, పెన్షన్‌ ఫండ్స్‌ సహా అమెరికా, ఐరోపా, కెనడా, కొరియా, జపాన్‌, పశ్చిమాసియా, ఆస్ట్రేలియా, సింగపూర్‌ తదితర దేశాలకు చెందిన అగ్రశ్రేణి సంస్థాగత పెట్టుబడిదారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సంస్థల ఆధీనంలో దాదాపు 6 ట్రిలియన్‌ డాలర్ల ఆస్తులున్నాయి. భారత ఆర్థిక వ్యవస్థ పరిమాణాన్ని 5 ట్రిలియన్‌ డాలర్లకు చేర్చడం, దేశం అనుసరిస్తున్న ఆర్థిక విధానాలు, సంస్కరణలు, ఇక్కడ పెట్టుబడులు పెట్టేందుకున్న అవకాశాలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చించారు. కేంద్ర ఆర్థిక శాఖ, నేషనల్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ అండ్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ ఫండ్‌ ఈ సమావేశాన్ని నిర్వహించాయి.