గురువారం 02 జూలై 2020
National - Feb 02, 2020 , 02:01:06

ఉరిపై స్టే ఎత్తేయండి

ఉరిపై స్టే ఎత్తేయండి
  • నిర్భయ దోషులకు వ్యతిరేకంగా హైకోర్టుకు కేంద్రం
  • వినయ్‌ క్షమాభిక్ష పిటిషన్‌ తిరస్కరణ
  • క్షమాభిక్ష కోరిన మరో దోషి అక్షయ్‌

న్యూఢిల్లీ: నిర్భయ కేసు దోషులైన ముఖేశ్‌ కుమార్‌, వినయ్‌ శర్మ, పవన్‌ గుప్తా, అక్షయ్‌ సింగ్‌ల ఉరిశిక్ష అమలుపై ఢిల్లీ కోర్టు శుక్రవారం ఇచ్చిన స్టేను ఎత్తివేయాలని కేంద్రం డిమాండ్‌ చేసింది. ఈ మేరకు శనివారం ఢిల్లీ కోర్టును ఆశ్రయించింది. దోషులు తమకున్న న్యాయపరమైన అవకాశాలను ఉద్దేశపూర్వకంగా ఆలస్యం చేస్తూ న్యాయస్థానాలతో ఆటలాడుతున్నారని పిటిషన్‌లో ఆరోపించింది. ఈ నేపథ్యంలో ట్రయల్‌ కోర్టు ఇచ్చిన స్టే ఎత్తివేయాలని కోరింది. ఈ పిటిషన్‌పై శనివారం విచారణ జరిపిన న్యాయమూర్తి సురేశ్‌ కుమార్‌ కైత్‌ వివరణ కోరుతూ నలుగురు దోషులతోపాటు తీహార్‌ జైలు అధికారులకు నోటీసులు జారీ చేశారు. మరోవైపు, దోషుల్లో ఒకడైన వినయ్‌ కుమార్‌ శర్మ పెట్టుకున్న క్షమాభిక్ష అభ్యర్థనను రాష్ట్రపతి శనివారం తిరస్కరించారు. 


ఈ నేపథ్యంలో నలుగురు దోషులకు ఉరి శిక్ష అమలు తేదీ ఖరారు కోసం ఢిల్లీ పాటియాల కోర్టును శనివారం ఆశ్రయించినట్లు తీహార్‌ జైలు డీజీ సందీప్‌ గోయల్‌ తెలిపారు. కాగా, మరో దోషి అక్షయ్‌ కుమార్‌ రాష్ట్రపతికి క్షమాభిక్ష పిటిషన్‌ను శనివారం దాఖలు చేసినట్లు జైలు అధికారులు వెల్లడించారు. వినయ్‌, అక్షయ్‌ క్యురేటివ్‌ పిటిషన్లను సుప్రీంకోర్టు తిరస్కరించిన సంగతి తెలిసిందే. నిబంధనల ప్రకారం దీని తర్వాతే రాష్ట్రపతిని క్షమాభిక్ష కోరాల్సి ఉంటుంది. దోషుల్లో ఒకడైన పవన్‌ ఇంకా క్యురేటివ్‌ పిటిషన్‌ దాఖలు చేయలేదు.


logo