సోమవారం 18 జనవరి 2021
National - Nov 24, 2020 , 17:34:13

రేపు, ఎల్లుండి 80వ స్పీక‌ర్‌ల స‌ద‌స్సు.. ప్రారంభించ‌నున్న రాష్ట్ర‌ప‌తి

రేపు, ఎల్లుండి 80వ స్పీక‌ర్‌ల స‌ద‌స్సు.. ప్రారంభించ‌నున్న రాష్ట్ర‌ప‌తి

న్యూఢిల్లీ: గుజ‌రాత్ రాష్ట్రం న‌ర్మ‌దా జిల్లాలోని కెవాడియా ప‌ట్ట‌ణంలో రేపు (నవంబ‌ర్ 25న‌) 80వ స్పీక‌ర్ల స‌ద‌స్సు ప్రారంభం కానున్న‌ది. న‌వంబ‌ర్ 25, 26 తేదీల్లో రెండు రోజుల‌పాటు జ‌రుగ‌నున్న ఈ స‌ద‌స్సును రాష్ట్ర‌ప‌తి రామ్‌నాథ్ కోవింద్ ప్రారంభించ‌నున్నారు. ఈ మేర‌కు లోక్‌స‌భ స్పీక‌ర్ ఓంబిర్లా ఒక ప్ర‌క‌ట‌న చేశారు. ఈ నెల 26న రాజ్యాంగ దినోత్స‌వాన్ని పుర‌స్క‌రించుకుని లోక్‌స‌భ ఈ రెండు రోజుల కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హిస్తున్న‌ది. 

లోక్‌స‌భ‌, రాజ్య‌స‌భ‌తోపాటు దేశంలోని వివిధ చ‌ట్ట‌స‌భ‌ల ప్రిసైడింగ్ ఆఫీస‌ర్ల మ‌ధ్య చ‌ర్చ‌ల‌కు అవ‌కాశం క‌ల్పించే ఉద్దేశంతో 1921 నుంచి ఈ స్పీక‌ర్ల స‌ద‌స్సు నిర్వ‌హిస్తున్నారు. అయితే కొన్ని అనివార్య కారణాలవ‌ల్ల మ‌ధ్య‌లో కొన్ని కాన్ఫ‌రెన్స్‌లు జ‌రుగ‌లేదు. అందుకే స్పీక‌ర్ల్ స‌మావేశాలు మొద‌లైన ఈ ఏడాదికి వందేండ్లు పూర్తియినా, ప్ర‌స్తుతం 80వ సమావేశం జ‌రుగుతున్న‌ది. కాగా, హార్మోనియ‌స్ కోఆర్డినేష‌న్ బిట్వీన్ లెజిస్లేచ‌ర్‌, ఎగ్జిక్యూటివ్ అండ్ జ్యుడీషియ‌రీ-కీ టు ఎ వైబ్రాంట్ డెమోక్ర‌సీ అనే థీమ్‌పై ఈ స‌మావేశం నిర్వ‌హిస్తున్నారు.

ఈ స‌మావేశానికి స్పీక‌ర్ ఓంబిర్లా, రాజ్య‌స‌భ ఛైర్మ‌న్ వెంక‌య్య‌నాయుడు, గుజ‌రాత్, రాజ‌స్థాన్ రాష్ట్రాల గ‌వ‌ర్న‌ర్‌లు, గుజ‌రాత్ ముఖ్య‌మంత్రి విజ‌య్‌రూపానీ, కాంగ్రెస్ లోక్‌స‌భాప‌క్ష నేత అధిర్ రంజ‌న్ చౌధురి, కేంద్ర పార్ల‌మెంట‌రీ వ్య‌వ‌హారాల మంత్రి ప్ర‌హ్లాద్ జోషి, వివిధ రాష్ట్రాల శాస‌న‌స‌భ‌లు, శాస‌న‌మండ‌ళ్ల స్పీక‌ర్లు హాజ‌రుకానున్నారు. స‌ద‌స్సు చివ‌రి రోజైన న‌వంబ‌ర్ 26న ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ స‌మావేశానికి హాజ‌రై తుది ప్ర‌సంగం చేయ‌నున్నారు.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.